Share News

తల్లి మందలించిందని..

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:16 AM

రాత్రంతా ఇంటికి రాకుండా బయట తిరగడంతో తల్లి మందలించిందనే మనస్తాపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లి మందలించిందని..

ఆరిలోవ (విశాఖపట్నం), సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాత్రంతా ఇంటికి రాకుండా బయట తిరగడంతో తల్లి మందలించిందనే మనస్తాపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సాగర్‌నగర్‌ సమీప భువనేశ్వరికాలనీ లో సోమవారం జరిగింది. ఆరిలోవ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు... విజయనగరం జిల్లా రామభద్రపురం మండ లం ఆరికతోటకు చెందిన గుగ్గి రాధ, ఈశ్వరరావు దంపతులు బతుకు తెరువుకోసం ఏడేళ్ల కిందట విశాఖ వచ్చి భువనేశ్వరి కాలనీలో నివసిస్తున్నారు. వీరికి కుమారుడు అప్పలరాము (23), కుమార్తె ఉన్నారు. రాము మెకానిక్‌ షాప్‌లో పనిచేస్తుండగా, ఈశ్వరరావు కూలీ. రాధ, ఆమె కుమార్తె ఇంటి పను లు చేస్తుంటారు. కాగా ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అప్పలరాము రాత్రంతా తిరిగిరాలేదు. ఉదయం రావడంతో తల్లి మందలించి, ఎప్పటిలానే పనిలోకి వెళ్లిపోయింది. మధ్యాహ్న భోజనానికి వచ్చిన తరువాత ఇంటికి తలుపులు వేసి ఉండడంతో కుమారుడు నిద్రిస్తున్నాడని భావించింది. ఎంతసేపు తలుపులు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూసే సరికి అప్పలరాము ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో గగ్గోలుపెట్టి స్థానికుల సాయంతో గీతం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో మందలించానని, దీంతో మనస్తాపం చెందిన ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో అప్పలరాము తల్లి రాధ పేర్కొంది.

Updated Date - Sep 22 , 2026 | 12:16 AM