beauty parlurs in wrong rute అపు‘రూపం’ నిజమేనా?
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:34 PM
beauty parlurs in wrong rute ఆకర్షణీయమైన రూపం.. మెరిసిపోయే చర్మం కోసం ఆరాట పడే యువతను కొన్ని బ్యూటీపార్లర్లు కాసుల కక్కుర్తికి వాడుకుంటున్నాయి. వారికి లేనిపోని ఆలోచనలు కల్పించి అందంగా మారుస్తామని నమ్మబలుకుతున్నాయి.
అపు‘రూపం’ నిజమేనా?
డెర్మటాలజిస్టుల అవతారం ఎత్తుతున్న బ్యూటీషీయన్లు
అలంకరణ ముసుగులో వైద్య చికిత్సలు
కనీస అవగాహన లేకుండానే లేజర్‌ల ప్రయోగం
అక్కడక్కడ వికటించి ఇబ్బందులు పడుతున్న బాధితులు
పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ
- నగరానికి చెందిన ఓ యువతి వివాహానికి ముందు ఇన్‌స్టెంట్ గ్లో కోసం బ్యూటీ పార్లర్‌లో ’ కెమికల్ పీలింగ్’ చేయించుకుంది. అయితే అక్కడి బ్యూటీషియన్ నిర్లక్ష్యంతో రసాయన మోతాదు ఎక్కువై ముఖమంతా కాలిపోయి బొబ్బలు వచ్చాయి. దీంతో ఆ యువతి హుటాహుటిన డెర్మటాలజిస్టును ఆశ్రయించి చికిత్స చేయించుకుంది.
- అవాంఛిత రోమాల తొలగింపు కోసం ఓ యువకుడు బ్యూటీ సెలూన్‌లో తక్కువ ధరకు లేజర్ ప్యాకేజీ తీసుకున్నాడు. మిషన్ సెట్టింగ్స్‌పై అవగాహన లేని బ్యూటీషియన్ హై పవర్ ప్రయోగించడంతో చర్మం కాలి మెడపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి.
విజయనగరం రింగురోడ్డు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఆకర్షణీయమైన రూపం.. మెరిసిపోయే చర్మం కోసం ఆరాట పడే యువతను కొన్ని బ్యూటీపార్లర్లు కాసుల కక్కుర్తికి వాడుకుంటున్నాయి. వారికి లేనిపోని ఆలోచనలు కల్పించి అందంగా మారుస్తామని నమ్మబలుకుతున్నాయి. క్లినిక్‌లకు వెళ్తే చాలా డబ్బులు ఖర్చవుతాయని చెబుతూ తమవైపు ఆకర్షితులను చేస్తున్నాయి. కేవలం బాహ్య అలంకరణ కోసం పరిమితం కావాల్సిన ఈ పార్లర్లు.. ఏకంగా స్కిన్ క్లినిక్‌లుగా మారిపోతున్నాయి. నిపుణులైన చర్మ వ్యాధి వైద్యులు, ప్లాస్టిక్ సర్జన్‌లు చేయాల్సిన అత్యంత సున్నితమైన చికిత్సలను కనీస వైద్య విద్య లేని బ్యూటీషియన్లు కటింగ్.. సెలూన్ గదుల్లోనే కానిచ్చేస్తున్నారు. పరికరాల వాడకంలో కనీసం ప్రమాణాలు పాటించడం లేదు. దీనివల్ల బాధితులు ఒక్కోసారి శాశ్వత వైకల్యం బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కేంద్రాలు విజయనగరంలో ఇటీవల కాలంలో బాగా విస్తరిస్తున్నాయి. ఇతర పట్టణాల్లోనూ ఉన్నాయి.
హద్దులు దాటుతున్న అలంకరణ
సాధారణంగా ఫేషియల్, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ వంటి బాహ్య అలంకరణ సేవలు అందించడం బ్యూటీపార్లర్ల పని కాని నగరంలోని కొన్ని విలాసవంతమైన పార్లర్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. అధిక లాభాల కోసం క్లినికల్ ట్రీట్‌మెంట్ సైతం యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డెర్మటాలజిస్టులు లేదా ప్లాస్టిక్ సర్జన్‌లు చేయాల్సిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను బ్యూటీషియన్లే నిర్వహిస్తున్నారు.
ప్రాణాంతకమైన లేజర్ ప్రయోగాలు
చర్మంపై అవాంఛిత రోమాలు తొలగించేందుకు వాడే లేజర్‌గన్‌లను వైద్యుల పర్యవేక్షణ లేకుండానే ఉపయోగిస్తున్నారు. చర్మ తత్త్వాన్ని బట్టి లేజర్ తీవ్రతను సెట్ చేయకపోవడంతో ముఖం కాలిపోయి శాశ్వత మచ్చలు పడుతున్న కేసులు వందల్లో ఉన్నాయి.
రసాయనాలతో చికిత్స
బ్యూటీ పార్లర్లలో ముఖంపై మొటిమలు మచ్చలు తగ్గించేందుకు వాడే కెమికల్ పీలింగ్ ప్రక్రియలో అధిక గాఢత కలిగిన అమ్లాలను వాడుతున్నారు. దీని వల్ల చర్మం పైపొర పూర్తిగా దెబ్బతిని తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంజెక్షన్ల దందా
తెల్లబడడం కోసం గ్లుటాథియోన్ ఇంజెక్షన్లను, ముడతలు పోగొట్టేందుకు బోటాక్స్ వంటివి బ్యూటీషియన్లే నేరుగా ఇచ్చేస్తున్నారు. రక్త పరీక్షలు చేయకుండా అత్యవసర మందులు సిద్ధంగా వుంచుకోకుండా ఇస్తున్న ఈ ఇంజక్షన్ల వల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా ప్రాణాపాయ స్థితి కలిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆ సర్టిఫికెట్ సరిపోతుందా?
ఒక డెర్మటాలిజిస్ట్ పదేళ్ల పాటు వైద్య విద్యను అభ్యసిస్తే తప్ప, చర్మంపై ప్రయోగాలు చేసే అర్హత రాదు. కాని కొన్ని వారాల క్రష్ కోర్సులతో సర్టిఫికెట్ పొందిన బ్యూటీషియన్లు తామే నిపుణులమంటూ రంగంలోకి దిగుతున్నారు. చర్మం లోపలి పొరల వరకూ ప్రభావం చూపే చికిత్సలు చేసే హక్కు వీరికి లేదు. కాని కొంత మంది పార్లర్‌ల నిర్వాహకులు బయట బోర్డులపై ’కాస్మోటాలజిస్ట్’ అని పెద్ద, పెద్ద అక్షరాలతో రాసి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. జిల్లా చిన్న, పెద్దా కలిపి బ్యూటీపార్లర్‌లు వందకు పైగా ఉన్నట్టు సమాచారం.
నిబంధనలు పట్టకుండా..
స్టెరిలైజేషన్ వాడే కత్తెరలు, దువ్వెనలు, బ్రష్‌లను ఒకసారి వినియోగించిన తరువాత స్టెరిలైజ్ చేయాలి. దీని కోసం యువీ స్టెరిలైజర్ మిషన్లు వుండాలి. వాడి పారేసిన కాటన్, బ్లేడ్‌లు, రసాయన బాటిళ్లను బయో-మెడికల్ వేస్ట్ నిబంధనల ప్రకారం పారబోయాలి. ఈ నిబంధనలు ఏవీ బ్యూటీపార్లర్‌లలో పాటించడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
కానరాని తనిఖీలు
నగరంలో పేరు, ఊరు లేని పార్లర్‌లలో ఏయే చికిత్సలు జరుగుతున్నాయో? పర్యవేక్షించాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం ’ క్లినికల్ చికిత్సలు చేసే చోట తప్పనిసరిగా క్వాలిఫైడ్ డాక్టరు ఉండాలి. నిబంధనలు అతిక్రమిస్తే, జైలు శిక్ష, లైసెన్సు రద్దు వంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. అయినా వారి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది.
చర్యలు తప్పవు
డాక్టరు ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ, విజయనగరం
బ్యూటీపార్లర్ల నిర్వహణకు, క్లినికల్ చికిత్సకు అసలు సంబంధమే లేదు. కార్మికశాఖ నుంచి కేవలం దుకాణాల చట్టం కింద లైసెన్సు పొంది, క్లీనిక్‌లాగా బోర్డులు పెట్టడం చట్ట విరుద్ధం. చర్మం అనేది మానవ శరీరంలో అత్యంత సున్నితమైన అవయవం. క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్‌ల పర్యవేక్షణ లేకుండా లేజర్లు, ఇంజక్షన్లను వాడడం ప్రమాదకరం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే బ్యూటీ పార్లర్‌లపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్టు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టు కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇటు ప్రజలు కూడా చర్మ సౌందర్య ప్రకటనలు చూసి మోసపోకూడదు. క్వాలిఫైడ్ డెర్మటాలజిస్టు, ప్లాస్టిక్ సర్జన్లను మాత్రమే సంప్రదించి చికిత్స చేసుకోవాలి.
----------------------------