beach dull తీరం.. ఆహ్లాదానికి దూరం
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:41 AM
beach dull సముద్ర తీరం.. సాధారణ ప్రజల నుంచి పర్యాటకుల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు ఆహ్లాద స్థావరంగా భావిస్తారు. సెలవు రోజుల్లో బీచ్‌కు వెళ్లాలని తహతహలాడుతుంటారు. ఒడ్డుకు వచ్చే కెరటాలను తాకాలని ఉవ్విళ్లూరుతుంటారు.
తీరం.. ఆహ్లాదానికి దూరం
కానరాని పర్యాటకాభివృద్ధి
జిల్లాలో 28 కిలోమీటర్ల పొడవైన బీచ్
అభివృద్ధితో ఆదాయం, ఉపాధికి అవకాశం
ఆ వైపుగా దృష్టిసారించని ప్రభుత్వం
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
సముద్ర తీరం.. సాధారణ ప్రజల నుంచి పర్యాటకుల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు ఆహ్లాద స్థావరంగా భావిస్తారు. సెలవు రోజుల్లో బీచ్‌కు వెళ్లాలని తహతహలాడుతుంటారు. ఒడ్డుకు వచ్చే కెరటాలను తాకాలని ఉవ్విళ్లూరుతుంటారు. మరి జిల్లాలోని తీర ప్రాంతం అందుకు సిద్ధంగా ఉందా? ఆటవిడుపునకు చక్కని స్థలంగా మారుతుందా? కేరింతలు కొట్టేందుకు ప్రభుత్వం అనుమైన సౌకర్యాలు కల్పించిందా? అంటే లేదనే సమాధానమే అందరి నుంచి వినిపిస్తోంది. ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని తీర ప్రాంతం గురించి కథనం.
భోగాపురం/పూసపాటిరేగ, సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి):
తీర ప్రాంత జిల్లా అయిన పక్కనే ఉన్న విశాఖ జిల్లా సముద్రతీరంలో బీచ్‌లను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. దీంతో వాటిని నిరంతరం పర్యాటకులు సందర్శిస్తుంటారు. భీమిలి నుంచి విశాఖ వరకు సముద్రతీరం నిరంతరం పర్యాటకుల తాకిడి ఉంటుంది. కొత్తవారు విశాఖ వెళ్లారంటే బీచ్‌ను చూడకుండా తిరిగి వెళ్లరు. అలాగే బీచ్ ఆధారంగా వ్యాపారాలు, హోటళ్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా ఉపాధి పొందుతున్నారు. విశాఖను ఆనుకొని ఉన్న విజయనగరం జిల్లా బీచ్‌లు ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయడంలేదు. విజయనగరం జిల్లాలో సుమారు 28కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం ఉంది. భోగాపురం, పూసపాటిరేగ రెండు మండలాలు తీర ప్రాంత మండలాలుగా ఉన్నాయి. ఈరెండు మండలాల పరిధిలో సుమారు 20 గ్రామాలున్నాయి. చింతపల్లి, ముక్కాం, కొండ్రాజుపాలెం, ఎర్రముసలయ్య పాలెం, చోడిపల్లిపేట, తమ్మయ్యపాలెం, తిప్పలవలస, బొడ్డుగురయ్యపేట తదితర గ్రామాల వద్ద బీచ్ కాస్త సౌకర్యంగా ఉంటుంది. పూసపాటిరేగ మండలం చింతపల్లి బీచ్ మాత్రం కార్తీకమాసంలో పిక్నిక్‌లకు, పుణ్యస్నానాల సమయంలో పర్యాటకుల తాకిడి ఉంటుంది. చింతపల్లిలో కాటేజీలు ఉన్నా అభివృద్ధి జరగలేదు.
అభివృద్ధి జరగాలంటే...
ప్రధానంగా బీచ్‌కారిడార్ నిర్మించి రహదారి కనెక్టవిటీ మెరుగుపరచాల్సి ఉంది. బీచ్ రహదారిని ఆనుకొని తీరం వెంబడి చెట్లు నాటితే చాలా ఆహ్లాదంగా ఉంటుందని పర్యాటకులు అభిప్రా యపడుతున్నారు. తీరం వెంబడి కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయాలి. పిల్లలను, పెద్దలను ఆకట్టుకొనేలా బొమ్మలను అందుబాటులో ఉంచాలి. పార్కింగ్ ఏరియా, తాగునీటి సౌకర్యం, 24 గంటలూ విద్యుత్ సౌకర్యం, తీరం వెంబడి సోలాల్ విద్యుత్తు దీపాలు వంటివి ఉంటే మరింత అందం. నడవడానికి ఫుట్‌పాత్, ప్లాస్టిక్ నిషేధం, పారిశుధ్యం మెరుగుపరచడం, ఫుడ్ కోర్టులు, బీచ్‌లో టూరిస్టులకు బోటు ప్రయాణం ఏర్పాటు, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సైన్‌బోర్డులు, రక్షణ సిబ్బంది, లైప్‌గార్డ్స్, వాచ్‌టవర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు, ప్రయాణ సౌకర్యం తదితర వాటిని ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా బీచ్‌లు అభివృద్ధి చెందడంతో పాటు టూరిజంను ఆకట్టుకొనే అవకాఽశం ఉంది.
అవకాశాలు ఉన్నాయ్ కానీ..
జిల్లాలో విశాలమైన బీచ్‌లు ఉన్నాయి. చేలకంచేరు, ముక్కాం, ఎర్రముసలయ్యపాలెం, కొండ్రాజుపాలెం, చింతపల్లి, తమ్మయ్యపాలెం, బొడ్డురుగవయ్యపేట తదితర గ్రామాల పరిధిలో బీచ్ చాలా అందగా.. విశాలంగా ఉంది. తీరం వెంబడి రహదారులు నిర్మించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రయాణ సౌకర్యం, టూరిస్టులు కూర్చోవడానికి అనువుగా సౌకర్యాలు కల్పించాలి. దీనివల్ల స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతుంది.
- జి.చినరాము, మత్స్యకారుడు, ముక్కాం