Be prepared for the local elections.స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:12 AM
Be prepared for the local elections. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
సాధారణ ఎన్నికల తరహాలోనే కూటమికి విజయాలు రావాలి
ఇంటింటికీ వెళ్లి రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించండి
మై టీడీపీ యాప్‌ను శతశాతం వినియోగించుకోవాలి
టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్ పిలుపు
విజయనగరం/ విజయనగరం రూరల్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. విజయనగరం పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం చెల్లూరులో తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. 2024 సాధారణ ఎన్నికల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఉండాలని, ఆ దిశగా అందరూ క్షేత్రస్థాయి నుంచీ పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సంక్షేమాన్ని కూడా అదే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి కింద మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, పెన్షన్‌ల పెంపు, రైతులకు చేయూత ఇలా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖలో పలు దిగ్గజ ఐటీ సంస్థలు, అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఇలా ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాఽధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రజలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఎన్నో రకాలుగా వేధించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. మాన్సాస్ చైర్మన్, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి దించడం, ఆయనను అరెస్టు చేయడానికి ఎన్నో విధాలుగా సైకో జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నించారన్నారు. తనపై కూడా 23 కేసులు వేశారని, వాటిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసులు కూడా బనాయించారన్నారు. అయినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేసులకు భయపడలేదన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా నమోదైన కేసులను పరిశీలించి, ఆయా కేసులను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక విభాగం ఉందని, ఆ విభాగానికి సమాచారం అందించాలని సూచించారు.
ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలన్నారు. మై టీడీపీ యాప్‌ను శతశాతం వినియోగించుకోవాలన్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఇందులో అప్‌లోడ్ చేయాలన్నారు. మై టీడీపీ యాప్‌ను క్షేత్రస్థాయి నుంచి పార్టీ నాయకులు వరకూ అందరూ వీక్షిస్తారన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టీడీపీ జోన్ కో-ఆర్డినేటర్, తణుకు ఎమ్మెల్యే ఎ.రాధాకృష్ణ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమాన స్థాయిలో తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబుదేనన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, రెండేళ్లలో విజయనగరంలో చేపట్టిన వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, టీడీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిమిడి నాగార్జున, ప్రసాదుల ప్రసాద్, నగర టీడీపీ అధ్యక్షుడు గంటా రవి, పూసపాటి రాజేష్‌వర్మ, అవనాపు విజయ్, అవనాపు భార్గవి, సుంకరి సాయికృష్ణ , సీహెచ్‌సీఎస్‌వి రాజు (సతీష్‌రాజు), తుమ్మగంటి చిన్నరామారావు, వేచలపు శ్రీనివాసరావుతో పాటు క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలు, పార్టీ గ్రామ, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
తానూ ఓ విద్యార్థిగా..
దాసన్నపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో స్కూల్ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరైన మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో కలిసి కొద్దిసేపు పాఠాలను విన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఉన్నాతాధికారులతో మాట్లాడారు.
స్వాగతం పలికిన హోంమంత్రి అనిత
విజయనగరం దాసన్నపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్ట్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరైన మంత్రి లోకేశ్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత స్వాగతం పలికారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన రాజేష్‌ను మంత్రి లోకేశ్ అభినందించారు. రోల ర్ స్కేటింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఓ విద్యార్థికి మంత్రి లోకేశ్ ప్రశంసాపత్రాన్ని అందించారు.