Share News

గెడ్డ, సాగరం.. అయితే మాకేం!

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:15 AM

: ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. చివరకు చెరువులు, వాగులు, గెడ్డలు, సాగరాలను కూడా అక్రమార్కులు వదలడం లేదు.

గెడ్డ, సాగరం.. అయితే మాకేం!
రుద్రసాగరాన్ని ఆక్రమించి పొలం ఏర్పాటు చేసిన దృశ్యం

- కబ్జాచేసి పొలాలుగా మార్చేస్తున్న వైనం

- కనుమరుగవుతున్న సారధి గెడ్డ

-అదేరీతిన రుద్రసాగరం

- వందలాది ఎకరాల ఆయకట్టుకు అందని సాగునీరు

రాజాంరూరల్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. చివరకు చెరువులు, వాగులు, గెడ్డలు, సాగరాలను కూడా అక్రమార్కులు వదలడం లేదు. వందలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే సారధి గెడ్డ, రుద్రసాగరం ఆక్రమణకు గురవుతున్నాయి. వీటిని కొందరు కబ్జా చేసి పొలాలుగా మార్చేస్తున్నారు. ఫలితంగా మూడు మండలాల పరిధిలో సుమారు 50 గ్రామాల్లోని భూములకు సాగునీరందక బీడుగా మారుతున్నాయి. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇదీ పరిస్థితి..

బొబ్బిలి రాజుల కాలంలో ఈ సాగునీటి వ్యవస్థ రూపుదిద్దుకుంది. తెర్లాం మండలంలోని సారధి గెడ్డ మిగులు జలాలు రాజాం మండలంలోని మారేడుబాక, పెనుబాక, బొద్దాం, కొత్తవలస, సారధి గ్రామాల మీదుగా రాజాంలోని రంగప్ప చెరువుకి చేరేలా అప్పట్లో కాలువ నిర్మించారు. రంగప్పచెరువు నిండిన తరువాత అక్కడి నుంచి అంతకాపల్లి, మొగిలివలస మీదుగా శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలం పెంట, కొత్తపెంట, సీతంపేట తదితర 40 గ్రామాల్లోని భూములకు సాగునీరు ప్రవహించేలా సారధి గెడ్డను నిర్మించారు. గెడ్డ నీరు గొలుసుకట్టు విధానం ద్వారా ఆయాగ్రామాల చెరువుల్లోకి చేరేది. వాటికింద సుమారు 2వేల ఎకరాలు సాగయ్యేది. అదేవిధంగా తెర్లాం మండలం పెరుమాళి మీదుగా రుద్రసాగరం ద్వారా ప్రవహించే మిగులు జలాలు అదే మండలం అరసబలగ, చీకటిపేట మీదుగా రాజాం మండలంలోకి ప్రవేశించేవి. ఇక్కడ నుంచి కొత్తపేట, ఒమ్మి, ఆగూరు, కంచరాం, అమరాం, గడిముడిదాం, సి.ఎస్‌.ఆర్‌.పురంలోని భూములకు సాగునీరు చేరేది. తరువాత రేగిడి మండలం పనసలవలస, పారంపేట, కాగితాపల్లి తదితర గ్రామాల్లోని సుమారు 1800 ఎకరాలకు నీరందేది. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ఆక్రమణలతో సారధిగెడ్డ, రుద్రసాగరం పిల్ల కాలువల్లా మారిపోయి నీరు ప్రవహించడం లేదు. సారధిగెడ్డలో సుమారు 30 కిలో మీటర్లు, రుద్రసాగరంలో సుమారు 25 కిలోమీటర్ల పొడవునా ఆక్రమించి పొలాలుగా మార్చేశారు. కొందరు ఈ పొలాలను సాగు చేస్తుంటే, మరికొందరు గట్లు వేసి తమ అధీనంలో ఉంచుకున్నారు.

చర్యలు తీసుకోవాలి

అసలే వర్షాభావ పరిస్థితులు. ఆపై కొందరు వ్యక్తుల స్వార్థంతో పొలాలకు సాగునీరందక ఇక్కట్లు పడుతున్నాం. సారధి గెడ్డను ఎక్కడికక్కకే ఆక్రమించి పొలాలు నిర్మించారు. దీంతో గెడ్డ పరిధిలోని భూములకు సాగునీరు అందడం లేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

- తవిటినాయుడు, రైతు, అంతకాపల్లి

దృష్టి పెడతాం..

రెండు జిల్లాల పరిధిలోని సారధి గెడ్డ, రుద్రసాగరంలో ఆక్రమణలు జరిగాయి. సమస్య జఠిలంగా మారింది. వీటిని తొలగించాలంటే లక్షలాది రూపాయలు అవసరం. అధికార యంత్రాంగం సమష్టిగా రంగంలోకి దిగితే తప్ప సమస్య పరిష్కారం కాదు. రాజాం మండల పరిధిలో ఆక్రమణలపై దృష్టి పెడతాను.

-రాజశేఖర్‌, తహసీల్దార్‌, రాజాం

Updated Date - Sep 04 , 2026 | 12:15 AM