లిఫ్ట్‌లతో జాగ్రత్త
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:20 AM
రెండు రోజుల కిందట శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కట్టా వెంకటేశ్వరరావు (బాబు) తన ఇంటిలో లిఫ్ట్ ప్రమాదంలో చెందాడు.
- ఆదమరిస్తే ప్రమాదాలు
- నిర్వహణను పట్టించుకోని వైనం
- తరచూ సాంకేతిక లోపాలు
- గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు
- రెండు రోజుల కిందట శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కట్టా వెంకటేశ్వరరావు (బాబు) తన ఇంటిలో లిఫ్ట్ ప్రమాదంలో చెందాడు. తన మొబైల్ చూస్తూ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ స్విచ్ నొక్కాడు. అయితే లిఫ్ట్ రాకముందే దాని తలుపులు తెరుచుకోవడంతో లోపలకు వెళ్లిన వెంకటేశ్వరరావు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్ పైభాగంలో పడి చనిపోయాడు.
- గత నెల శ్రీకాకుళం పీఎన్‌కాలనీలో భవన నిర్మాణ పనులకు ఇద్దరు కార్మికులు వెళ్లారు. లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతున్న సమయంలో రోప్ తెగిపోయింది. దీంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
-ఈ ఏడాది మేలో శ్రీకాకుళం పీఎన్‌కాలనీలో ఒక వ్యక్తి శుభ కార్యానికి బంధువులు ఇంటికి వచ్చాడు. పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ స్విచ్ నొక్కాడు. అయితే, డోర్‌లు ఓపెన్ అయ్యాయి గానీ లిప్ట్ రాకపోవడంతో కింద పడి ఆయన మరణించారు.
శ్రీకాకుళం క్రైం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో నేడు బహుళ అంతస్తుల భవనాలు, వాటిలో లిఫ్ట్‌లు సర్వసాధారణమయ్యాయి. లిఫ్ట్‌లతో సౌలభ్యం ఎంత ఉందో, ఆదమరిస్తే అంతే ప్రమాదం ఉంది. ప్రధానంగా అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్‌లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. మెట్లు ఎక్కలేక చాలా మంది లిఫ్ట్ట్‌లు పెట్టిస్తున్నారు. కానీ, వాటి నిర్వహణను అటు బిల్డర్లు, ఇటు అపార్ట్‌మెంట్ సొసైటీలు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల లిఫ్ట్ రోప్‌లు తెగిపడడం, అకస్మాత్తుగా డోర్‌లు తెరుచుకోవడం, డోర్లు సరిగా పడకపోయినా వెళ్లడం వంటివి జరుగుతున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం నగరంతో పాటు ముఖ్య పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు భారీగా వెలుస్తున్నాయి. ఒక్క శ్రీకాకుళంలోనే 50 వరకు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అదే విధంగా పదో సంఖ్యలో ఆస్పత్రుల భవనాలు ఉన్నాయి. వీటన్నింటికీ లిఫ్ట్‌లను వినియోగిస్తున్నారు. అయితే, నైపుణ్యం లేని ఇంజనీర్లు లిఫ్ట్‌లను బిగించడం, నాణ్యతలేని మెటీరియల్ వాడడం, సరైన నిర్వహణ లేకపోవడం వంటి కారణాలతో తరచూ మొరాయిస్తున్నాయి. చాలా అపార్ట్‌మెంట్లలో తక్కువ ధరకు వస్తుందని కోలాప్సబల్ (గ్రిల్) గేట్లు ఉన్న లిఫ్ట్‌లు పెడుతున్నారు. అవి పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. కొన్నిసార్లు ఈ గ్రిల్స్ మధ్య చేతులు ఇరుక్కుపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. లిఫ్ట్‌లోకి అడుగు పెట్టి మళ్లీ బయట వచ్చేంతవరకు ఏదో తెలియని ఆందోళన నెలకొంటుంది. పొరపాటున మధ్యలో ఆగినా, ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా, ఎక్కిన వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. సెన్సార్లతో నడిచే లిఫ్ట్‌ల్లోనూ సమస్యలు తప్పడం లేదు. ఒక్కోసారి డోర్లు చాలా త్వరగా మూసుకుపోవడం, పూర్తిగా తెరుచుకోకపోవడం వంటివి జరుగుతున్నాయి. అతిగా వాడడం, వెంటిలేషన్ సరిగా లేకపోవడం, ఓల్టేజ్‌లో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు వచ్చినప్పుడు ఉన్నట్టుండి మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొన్ని అపార్ట్‌మెంట్లలో జనరేటర్లు లేకపోవడంతో విద్యుత్ నిలుపుదల జరిగితే గంటల కొద్దీ లిఫ్ట్‌లో ఉండిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆస్తమా రోగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిబంధనలు ఇవీ..
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ చట్టం తీసుకొచ్చింది. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు, నిర్వహణతో పాటు భద్రతను క్రమబద్ధీకరించేందుకు ఈ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం కొత్తగా లిఫ్ట్‌లు లేదా ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలంటే ముందుగా సంబంధిత అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి. అమర్చిన తర్వాత వాటిని ఉపయోగించడానికి లైసెన్స్ పొందాలి. ఐదేళ్లకొకసారి ఆ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలి. లిఫ్ట్‌లను తయారు చేసేవారు లేదా అమర్చేవారు తప్పనిసరిగా గుర్తింపు పొంది ఉండాలి. వినియోగదారుల భద్రత కోసం ఆటోమేటిక్ రెస్క్యూ డివైజ్‌లు ఏర్పాటు చేయాలి. భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఇన్‌స్పెక్టర్‌ను నియమిస్తుంది.
లిఫ్ట్‌ల ఎంపిక ముఖ్యం..
లిఫ్ట్‌ను ఎంపిక చేసుకొనే ముందు లోడ్, సామర్థ్య అవసరాలు తెలుసుకోవాలి. అపార్ట్‌మెంట్‌లో ఎంతమంది ఉంటారు, తరచుగా ఎంతమంది ఉపయోగిస్తుంటారు తెలుసుకోవాలి. లిఫ్ట్ వేగం, సేఫ్టీ సిస్టమ్, ఆటోమేటిక్ రెస్క్యూ సిస్టమ్, లోడ్ వెయిటింగ్ డివైజ్, మెకానికల్ సేఫ్టీలాంటివి పరిగణలోనికి తీసుకోవాలి. పిల్లలు అధికంగా ఉన్న అపార్ట్‌మెంట్లు, విల్లాల్లో ఆటోమెటిక్ డోర్ లిఫ్ట్‌లు ఎంచకోవడం శ్రేయస్కరం. మాన్యువల్ కొలాప్సబల్ గేట్లు (గ్రిల్స్) ఉన్న లిఫ్ట్‌లు చాలా ప్రమాదకరం. మెషీన్ రూమ్ లెస్ లిఫ్ట్‌లు ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటిలో ఎలాంటి జెర్కలూ ఉండవు. ఫ్లోర్ లెవలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కమర్షియల్ బిల్డింగ్‌లతో పాటు గేటెడ్ అపార్ట్‌మెంట్లలో వీటిని వాడుతున్నారు. విల్లాల్లో అయితే వాక్యూమ్ లిఫ్ట్‌లు ఎంచుకోవచ్చు. తరచుగా లిఫ్ట్‌లను సర్వీస్ చేయిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ.