కాంటాక్టు లెన్స్‌తో జాగ్రత్త!
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:17 AM
మారిన జీవనశైలి, ఫ్యాషన్ మోజు, దృష్టిలోపాల సవరణ.. ఇలా కారణం ఏదైనా నేడు చాలా మంది కళ్లద్దాలకు ప్రత్యామ్నాయంగా కాంటాక్టు లెన్స్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.
- పరిశుభ్రత అత్యంత ముఖ్యం
- చిన్న నిర్లక్ష్యంతో కంటిచూపు పోయే ప్రమాదం
- అశ్రద్ధ వద్దని వైద్య నిపుణుల హెచ్చరిక
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మారిన జీవనశైలి, ఫ్యాషన్ మోజు, దృష్టిలోపాల సవరణ.. ఇలా కారణం ఏదైనా నేడు చాలా మంది కళ్లద్దాలకు ప్రత్యామ్నాయంగా కాంటాక్టు లెన్స్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వీటిని ఉపయోగిస్తే, కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉందని నేత్ర వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంటాక్టు లెన్స్‌లను సరిగ్గా నిర్వహించకపోవడం, శుభ్రత పాటించకపోవడం వల్ల కంటికి ఇన్‌ఫెక్షన్లు సోకి శాశ్వతంగా అంధత్వం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
‘అకాంటమీబా’తో ముప్పు
నదులు, కాలువలు, స్విమ్మింగ్ ఫూల్స్, కొళాయి నీటిలో కూడా అకాంటమీబా కెరటైటీస్ అనే సూక్ష్మజీవి జీవిస్తుంది. కాంటాక్టు లెన్స్‌లు ధరించి స్నానాలు చేసినా, ఈతకొట్టిన ఈ సూక్ష్మజీవి కంటిలోని నల్లగుడ్డుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శరీరంలోని రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వేగంగా విస్తరించి కంటి కణజాలన్ని క్రమంగా తినేస్తుంది. ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోకపోతే, చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం ఉంది.
- సుదీర్ఘ సమయం లెన్స్ ధరించడం వల్ల కంటికి ఆక్సిజన్ అందక కళ్లు పొడిబారి మంటలు వస్తాయి. లెన్స్ సరిగ్గా అమర్చకపోయినా, తీసేటప్పుడు జాగ్రత్త పడకపోయినా, నల్లగుడ్డుపై గీతలు పడి ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే అవకాశం ఉంది. లెన్స్ శుభ్రపరిచే సొల్యూషన్ పడకపోవడం లేదా దుమ్ముధూళి చేరడం వల్ల కళ్లు తీవ్రంగా ఎర్రబడి, దురదపుట్టి నేత్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నిర్లక్ష్యం వద్దు
- కాంటాక్టు లెన్స్ వాడేవారిలో కళ్లు ఎర్రబడడం, తీవ్రమైన నొప్పి, వెలుతురును చూడలేకపోవడం, కంటి నుంచి నిరంతరం నీరు కారడం, మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే లెన్స్‌లను తొలగించి నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలి.
- ఈత కొట్టేటప్పుడు, స్నానం చేసేటప్పుడు లెన్స్‌లను తప్పనిసరిగా తొలగించాలి. లెన్స్‌లను శుభ్రం చేయడానికి వైద్యులు సూచించిన డిసిన్ఫెక్టైంట్ సొల్యూషన్ మాత్రమే వినియోగించాలి. సాధారణ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. లెన్స్ పెట్టుకునేముందు, తీసేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. రోజుకి 8 నుంచి 10 గంటలు ఎక్కువ సమయం లెన్స్‌లను ధరించకూడదు. రాత్రి పడుకునే ముందు లెన్స్‌లను తప్పనిసరిగా తొలగించాలి.
- లెన్సు భద్రపరిచే కేస్‌ను ప్రతి నెలా లేదా కనీసం మూడు నెలలకు ఒకసారైనా మార్చాలి.
వైద్యుల సలహాలు లేకుండా లెన్సు వాడొద్దు
చాలా మంది నేత్ర వైద్యుల సలహా లేకుండా ఆన్‌లైన్‌లో లేదా బయట రంగు, రంగుల కాంటాక్టు లెన్స్‌ను కొని వాడుతుంటారు. లెన్స్ పవర్, బేస్ కర్వు సరిగ్గా కుదరకపోతే కంటిపై రాపిడి ఏర్పడుతుంది. అటువంటి సమయంలో అశ్రద్ధ చేయకుండా వెంటనే నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలి. కాంటాక్టు లెన్స్ ధరించే సందర్భంలో పరిశుభ్రత అనేది అత్యంత ముఖ్యం. చేతులు శుభ్రం చేసుకోకుండా లెన్స్‌ను తాకడం, వాటిని పెట్టుకుని నిద్ర పోవడం వల్ల కంటి నల్లగుడ్డికి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీని వల్ల కార్నియల్ అల్సర్, బ్యాక్టిరీయల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్విమ్మింగ్ ఫూల్స్, నదులు, కుళాయి నీటిలో అకాంటమీబా వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు ఉంటాయి. లెన్స్‌లు వేసుకుని నీటిలో దిగినప్పుడు ఈ సూక్ష్మజీవులు లెన్స్ కిందకు చేరి కంటి పొరలను దెబ్బతీస్తాయి. ఇది చాలా వేగంగా అంధత్వానికి దారితీస్తుంది. నీటిలోకి వెళ్లేటప్పుడు కాంటాక్ట్ లెన్స్ తీసేయడం లేదా వాటర్ ఫ్రూవ్ గాగుల్స్ వాడడం తప్పనిసరి.
-డాక్టర్ మంచు కుమారస్వామి, ఆప్తమాలజిస్ట్, విజయనగరం