Share News

బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:47 PM

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటేడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు.

బ్యాంకు ఉద్యోగుల సమ్మె
విజయనగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది

ఫ స్తంభించిన లావాదేవీలు

ఫఇబ్బందులు పడిన ఖాతాదారులు

విజయనగరం రింగురోడ్డు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటేడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు. దీనిలో భాగంగా బ్యాంకులను మూసివేశారు. జిల్లాలో పది బ్యాంకు రంగ సంస్థలకు చెందిన 250 శాఖలు, అన్ని విభాగాలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది 2,500 మంది ఈ సమ్మెలో భాగస్వాములయ్యారు. ఈ కారణంగా జిల్లాలోని రూ.500 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రమైన విజయనగరంతో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయనగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోట వద్ద ప్రారంభమై ర్యాలీ మూడులాంతర్లు, గంటస్థంబంతో పాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. యూఎఫ్‌బీయూ ప్రతినిధులు ఎం.రమేష్‌కుమార్‌, గుప్తా, బి.ప్రసాద్‌, బి.మృదుల మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలన్నారు. వారం రోజుల్లో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు ఉండే విధంగా చూడాలన్నారు. ప్రస్తుతం 2, 4 శనివారాలు సెలవు దినాలుగా ఉన్నాయని, మిగిలిన రెండు శనివారాలు కూడా సెలవులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ఐవీ రమణమూర్తి, శ్రావణ్‌, భానోజీ, చంద్రశేఖర్‌, సంతోష్‌తో పాటు బ్యాంకు యూనియన్‌ నాయకులు, వివిధ బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 11:47 PM