Share News

Ban? Where Is It? నిషేధమా.. అదెక్కడ?

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:45 PM

Ban? Where Is It? జీవ పర్యావరణానికి ముంపు వాటిల్లుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నిషేధించిన హెర్బీసైడ్‌ టాలరెంట్‌ (హెచ్‌టీ) పత్తి విత్తనాల విక్రయాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ విత్తనాలను ఎవరూ గుర్తించలేకపోవడం వ్యాపారు లకు కలిసొస్తుంది.. మరోవైపు పలు కారణాలతో కొంతమంది రైతులు కూడా హెచ్‌టీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలో చాలాచోట్ల హెట్‌టీ పత్తి సాగవుతోంది.

Ban? Where Is It? నిషేధమా.. అదెక్కడ?
గడ్డితో కూడిన పత్తి మొక్కలు (ఫైల్‌)

  • పలు కారణాలతో ఆ పంట సాగుకు రైతుల ఆసక్తి

  • పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు.. భూసారం తగ్గే అవకాశం

  • తనిఖీలు చేపడుతున్నా.. మారని పరిస్థితి

భామిని, జూన్‌26(ఆంధ్రజ్యోతి): జీవ పర్యావరణానికి ముంపు వాటిల్లుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నిషేధించిన హెర్బీసైడ్‌ టాలరెంట్‌ (హెచ్‌టీ) పత్తి విత్తనాల విక్రయాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ విత్తనాలను ఎవరూ గుర్తించలేకపోవడం వ్యాపారు లకు కలిసొస్తుంది.. మరోవైపు పలు కారణాలతో కొంతమంది రైతులు కూడా హెచ్‌టీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలో చాలాచోట్ల హెట్‌టీ పత్తి సాగవుతోంది.

జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట, కురుపాం, సీతంపేట, భామిని తదితర మండలాల్లో పత్తి సాగు అధికం. ఒక్క భామిని మండలంలోనే ఏటా సుమారు 5 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. అయితే కూలీ రేట్లకు భయపడి భూసారం కోసం ఆలోచించకుండా కొంతమంది హెచ్‌టీ పత్తి సాగు చేపడుతున్నారు. జిల్లాలో 50 శాతం వరకు ఈ రకం పత్తి సాగవుతోంది. గతంలో ఈ ప్రాంత రైతులు వరి, వేరుశనగ, గోగు, రాగులు, కందితో పాటు ఆరుతడి మెట్టు పంటలు సాగు చేసేవారు. అయితే ఇప్పుడు వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో పత్తిసాగు చేపడుతున్నారు. ఒకప్పుడు పత్తికి చీడపీడలు సోకడంతో ఈ సాగును కొన్నాళ్లు విరమించుకున్నారు. ఆ తర్వాత హెచ్‌టీ బీటీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి రావడంతో రైతులు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. సాధారణ విత్తనాలు జల్లిన తర్వాత ఏపుగా పెరిగే గడ్డి, కలుపు మొక్కలు తీయించేందుకు లేబర్‌ అవసరం. అయితే ప్రస్తుతం కూలీలు దొరకడం లేదు. ఒకవేళ కుదిరినా.. పెద్ద మొత్తంలో రైతులు చెల్లించలేకపోతున్నారు. ఈ క్రమంలో హెచ్‌టీ పత్తినే సాగు చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు జల్లిన తర్వాత ఏపుగా పెరిగే గడ్డి, కలుపు మొక్కలపై గ్రాసైల్‌ను స్ర్పే చేస్తున్నారు. దీంతో కలుపు మొక్కలు మాడిపోగా.. పత్తి దిగుబడులకు ఏ ఇబ్బందీ ఉండడం లేదు. ఈ క్రమంలో జిల్లాలో సరిహద్దు మండలాల వ్యాపారులు, రైతులు ఒడిశా నుంచి వాటిని తెప్పించుకుని సాగు చేపడుతున్నారు. ప్రైవేటు డీలర్లకు లాభదాయకంగా ఉండడంతో రైతులకు హెచ్‌టీ పత్తి విత్తనాలు, గ్రైసెల్‌, క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్నారు. పెట్టుబడులను కూడా అందిస్తూ.. పంట పండించిన తర్వాత వారే కొనుగోలు చేసి ఆ సొమ్మును రికవరీ చేసుకుంటున్నారు.

వాస్తవంగా హెచ్‌టీ, సాధారణ పత్తి విత్తనాలకు రేటులో పెద్దగా తేడాలేదు.. చీడ , పీడలు, తెగుళ్లు, కూలీల బెడద ఉండకపోవడం తదితర కారణాలతో రైతులు ఈ సాగుపై మొగ్గు చూపుతున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. నిషేధిత పత్తి విత్తనాలతో దొరికితే ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే హెచ్‌టీ పత్తి విత్తనాలను నిర్ధారించాలంటే వాటిని గుంటూరు పంపించాల్సి ఉంది. అక్కడ నుంచి ఫలితాలకు వచ్చేసరికి మూడు నెలల సమయం పడుతుంది. కాగా ఈ జాప్యమే వ్యాపారులకు కలిసొస్తుంది. మరోవైపు జిల్లాలో ఆ సాగు విస్తీర్ణం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే ఈ రకం సాగుపై ఉన్నతాధికారులు స్పందించాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై వ్యవసాయశాఖ ఏడీ రత్నకుమారిని వివరణ కోరగా.. ‘నిషేధిత హెచ్‌టీ పత్తి విత్తనాలు, గ్రైసెల్‌ స్ర్పే మందు విక్రయించే డీలరు, ఈరకం సాగు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రైతులకు ఈరకమైన పత్తిపై అవగాహన ఉండాలి. భూసారం, భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ పత్తి సాగు చేపట్టాలి.’ అని తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 11:45 PM