Share News

Ban Imposed వేటు పడింది

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:43 AM

Ban Imposed ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో.. విధులు నిర్వహించకుండానే అక్రమంగా బకాయి వేతనాలు పొందిన 13 మంది ఉపాధ్యాయులపై వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం వారిని విధుల నుంచి తొలగించారు. దీనిపై అప్పట్లోనే విచారణ జరగ్గా.. తాజాగా విద్యాశాఖ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.

Ban Imposed వేటు పడింది

  • ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ఘటన

  • అప్పట్లోనే వరుస విచారణలు

  • తాజా ఆదేశాలతో 13 మందిని విధుల నుంచి తొలగించిన వైనం

  • బాధ్యుల నుంచి సొమ్ము రికవరీ చేస్తారా?

పార్వతీపురం, ఏప్రిల్‌3(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో.. విధులు నిర్వహించకుండానే అక్రమంగా బకాయి వేతనాలు పొందిన 13 మంది ఉపాధ్యాయులపై వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం వారిని విధుల నుంచి తొలగించారు. దీనిపై అప్పట్లోనే విచారణ జరగ్గా.. తాజాగా విద్యాశాఖ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. కాగా ఉపాధ్యాయులు స్వాహా చేసిన ఆ నిధులను ఎప్పుడు రికవరీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ సొమ్మును బాఽధ్యుల ఉంచి వసూలు చేస్తారా? లేకుంటే తొలగింపులతోనే సరిపెడతారా? అన్నది విద్యాశాఖ తేల్చాల్సి ఉంది. అయితే దీనిపై కూడా త్వరలోనే స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు.

ఏం జరిగిందంటే?

జిల్లాలో ఆర్సీఎం విద్యాలయాల్లో ఉపాధాయుల పోస్టుల భర్తీకి 2003, ఆగస్టు 10న నోటిఫికేషన్‌ ఇచ్చారు. అదే నెలలో కొందరిని నియమించారు. అయితే ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆ నియామకాలను రద్దు చేయాలని 2009లో ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయా టీచర్ల అభ్యర్థన మేరకు 2017, జూలైలో 13 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. కాగా సక్రమంగా విధులు నిర్వహించాల్సిన గురువులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. 2017లో విధుల్లో చేరిన వారు .. 2003 నుంచి సర్వీసులో ఉన్నామని చూపి ఆ కాలానికి సంబంధించిన జాతం బకాయిలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు. మొత్తంగా విధులు నిర్వహించకుండానే అప్పటి విద్యాశాఖ అధికారుల సహకారంతో సుమారు రూ.4.04 కోట్ల బకాయి వేతనాలు డ్రా చేశారు.

ఫిర్యాదులపై వరుస విచారణలు

మొత్తంగా 13 మంది ఉపాధ్యాయులు అక్రమంగా వేతనాలు పొందారని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనాలపై సబ్‌ కలెక్టర్‌తో పాటు విద్యాశాఖ అధికారులు వరుసగా విచారణలు చేపట్టారు. 2003, సెప్టెంబరు నుంచి 2017, జూన్‌ 30 వరకు విధుల్లో ఉన్నట్లు ఆ 13 మంది ఉపాధ్యాయులు తప్పుడు పత్రాలు సమర్పించి వేతనాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎయిడెడ్‌ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో ఆ 13 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అయితే అప్పటి సబ్‌ కలెక్టర్‌ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో 13 మంది ఉపాధ్యాయులను సర్వీసు నుంచి రిమూవ్‌ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యంనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఆ 13 మంది ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించడం వాస్తవమే. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నాం.’ అని పార్వతీపురం మన్యం డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు.

Updated Date - Apr 04 , 2026 | 12:43 AM