రాజాం చేరిన బ్యాలెట్ బాక్సులు
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:10 AM
రెండో విడతలో నిర్వహించనున్న రాజాం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గురువారం సాయంత్రం 110 బ్యాలెట్ బాక్సులు చేరాయి.
రాజాం రూరల్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రెండో విడతలో నిర్వహించనున్న రాజాం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గురువారం సాయంత్రం 110 బ్యాలెట్ బాక్సులు చేరాయి. ప్రత్యేక వాహనంలో వచ్చిన వాటిని మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావుతో పాటు సిబ్బంది స్వాధీనం చేసుకుని ప్రత్యేక గదిలో భద్రపరిచారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులు, సిబ్బంది, ఏజెంట్ల శిక్షణకు సంబంధించిన మెటీరియల్ ఇప్పటికే మున్సిపల్ కార్యాలయానికి చేరాయి. ఇదిలా ఉంటే వార్డుల విభజన, అభ్యంతరాల స్వీకరణ, తుదిజాబితా విడుదల, పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఓటర్ల జాబితాల తయారీ తదితర పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాజాం మున్సిపాలిటీలో విలీన పంచాయతీలకు సంబంధించి న్యాయస్థానంలో 21 ఏళ్లపాటు వివాదం కొనసాగడం, ఇటీవలే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లను కొట్టివేసి, ఆరునెలలలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో రాజాం మున్సిపాలిటీకి రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.