Share News

Gold Jewellery బంగారు ఆభరణాలతో బ్యాగ్‌ మిస్సింగ్‌ ..

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:23 PM

Bag Missing with Gold Jewellery సాలూరు పట్టణంలో ఓ వ్యక్తికి చెందిన సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ పోయింది. బ్యాంక్‌ నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఎక్కడో అది పడిపోయింది. దీంతో బాధితుడు హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు అందిన సుమారు మూడు గంటల వ్యవధిలోనే పోలీసులు ఆ బ్యాగును గుర్తించి తిరిగి బాధితుడికి అందించారు.

  Gold Jewellery  బంగారు ఆభరణాలతో బ్యాగ్‌  మిస్సింగ్‌ ..
బాధితులకు బంగారు ఆభరణాలు అప్పగించిన ఎస్పీ

  • సాలూరులో ఘటన

  • అప్రమత్తమైన పోలీసులు.. తనిఖీలు ముమ్మరం

  • బాధితునికి ఆభరణాలు అందజేసిన ఎస్పీ

బెలగాం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణంలో ఓ వ్యక్తికి చెందిన సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ పోయింది. బ్యాంక్‌ నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఎక్కడో అది పడిపోయింది. దీంతో బాధితుడు హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు అందిన సుమారు మూడు గంటల వ్యవధిలోనే పోలీసులు ఆ బ్యాగును గుర్తించి తిరిగి బాధితుడికి అందించారు. వివరాల్లోకి వెళ్తే..

సాలూరుకు చెందిన ఓ వ్యక్తి శనివారం పట్టణంలోని ఒక బ్యాంకుకు వెళ్లారు. తన లాకర్‌ నుంచి సుమారు 900 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నారు. వాటిని ఓ బ్యాగులో పెట్టి.. బైక్‌ హుక్‌కు తగిలించి.. ఇంటికి తిరుగుపయనమయ్యారు. అయితే కోట జంక్షన్‌ నుంచి తెలగవీధి వైపు వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఆ బ్యాగ్‌ మిస్‌ అయినట్లు గుర్తించారు. బాధితుడు వెంటనే సాలూరు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ మాధవరెడ్డి సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందాన్ని టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరణ, విశ్లేషణ కోసం, మరో బృందాన్ని ఫిజికల్‌ ఎవిడెన్స్‌, క్షేత్రస్థాయి తనిఖీల కోసం నియమించారు. ఫిజికల్‌ ఎవిడెన్స్‌ బృందం సంఘటన ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి విచారణ చేపట్టింది. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలు పరిశీలించింది. మరోవైపు టెక్నికల్‌ బృందం కూడా తగు సమాచారం సేకరించింది. ఈ మేరకు పెదకోమటిపేట రామందిరం నుంచి తెలగవీధి వరకు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. డబ్బీ వీధి ప్రాంతంలో విచారణ చేస్తుండగా.. ఆ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తనకు దొరికిన బ్యాగ్‌ను పోలీసులకు అప్పజెప్పింది. బాధితుడు పేర్కొన్న బంగారు ఆభరణాలన్నీ ఆ బ్యాగులో ఉండడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి చేతుల మీదుగా బాధితులకు బంగారు ఆభరణాల బ్యాగ్‌ను అందించారు. అనంతరం సాలూరు పట్టణ పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

విదేశీయుల వివరాలు నమోదు చేయాలి

జిల్లాలో ఉండే విదేశీయుల వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. వారు బస చేసే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, గృహాలు, ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు విద్యా సంస్థలు, ఇతర సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం, పర్యాటకం ఇతర అవసరాల నిమిత్తం వివిధ దేశాల నుంచి ఎంతోమంది జిల్లాకు వస్తున్నారన్నారు. అయితే వారి పాస్‌పోర్టు, వీసా, వ్యక్తిగత, వసతి వివరాలను ది ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫార్నర్స్‌ చట్టం-2025 సెక్షన్‌ 8 ప్రకారం తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఆర్‌వోలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఈ విషయాన్ని 24 గంటల్లోపు విదేశీయులకు తెలియజేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై ది ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫార్మర్స్‌ చట్టం-2025, సెక్షన్‌ 23 (బి) ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండు నుంచి ఏడేళ్ల వరకు జైలు లేదా రెండూ విధించే అవకాశం ఉందన్నారు. జిల్లాకు వచ్చే వారు భారతదేశ చట్టాలను గౌరవించాలని, చెల్లుబాటులో ఉన్న వీసా, పాస్‌పోర్టు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. విదేశాల్లో స్థిరపడిన ఓసీఐ (ఓవరిసిస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా) భారతీయులు, దేశంలో నిర్వహించే ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని, ఓటు వేయరాదని, వ్యవసాయ భూములను కొనుగోలు చేయరాదని తెలిపారు.

Updated Date - Oct 03 , 2026 | 11:23 PM