Share News

వైసీపీ నుంచి బడ్డుకొండ సస్పెన్షన్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:25 AM

నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు, మాజీ జడ్పీ చైర్మన్‌ బడ్డుకొండ అప్పలనాయుడుని వైసీపీ సస్పెండ్‌ చేసింది.

 వైసీపీ నుంచి బడ్డుకొండ సస్పెన్షన్‌

విజయనగరం అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు, మాజీ జడ్పీ చైర్మన్‌ బడ్డుకొండ అప్పలనాయుడుని వైసీపీ సస్పెండ్‌ చేసింది. పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందటంతో క్రమ శిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల బడ్డుకొండ వియ్యంకుడు, మాజీ జడ్పీ చైర్మన్‌, వైసీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. చిన్న శ్రీను పార్టీ మారిన తరువాత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బడ్డుకొండ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను వైసీపీలోనే కొనసాగుతానని భావోద్వేగానికి గురై, కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, ఆ మరుసటి రోజే ఆయన్ను నెల్లిమర్ల నియోజవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

నేడు నిర్ణయం..

బడ్డుకొండ అప్పలనాయుడు తన అనుచరులు, అభిమానులతో శనివారం సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్టీలో తనకు ఎదురైన పరిణామాలను వారికి వివరించనున్నారు. భవిష్యత్‌ కార్యచరణ ప్రకటించనున్నారు. నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో బడ్డుకొండకు ప్రత్యేక అనుచరగణం ఉంది. వారంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:25 AM