Share News

టీడీపీలోకి బడ్డుకొండ

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:51 PM

స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి షాక్‌ తగిలింది. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు టీడీపీలో చేరారు.

  టీడీపీలోకి బడ్డుకొండ
టీడీపీలో చేరిన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఆయన అనుచరులు, చిత్రంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, హోంశాఖ మంత్రి అనిత

- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, మంత్రి అనిత సమక్షంలో చేరిక

- ఆయన అనుచరులు కూడా..

- స్థానిక ఎన్నికల వేళ బొత్స శిబిరంలో కలవరం

విజయనగరం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి షాక్‌ తగిలింది. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అక్కడే టీడీపీ సభ్యత్వం తీసుకొన్నారు. ఆయనతో పాటు అనుచరులు, వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బడ్డుకొండ..

2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవి బడ్డుకొండ అప్పలనాయుడుకు వరించింది. 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పెనుమత్స సాంబశివరాజును కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేయించాలనుకున్నారు. అయితే తనకు విజయనగరం ఎంపీ సీటు ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. కానీ, బొత్స ఝాన్సీకి ఎంపీ టికెట్‌ ఇవ్వడంతో సాంబశివరాజు మనస్తాపానికి గురయ్యారు. నెల్లిమర్ల నుంచి బరిలో దిగనని తేల్చిచెప్పారు. దీంతో అప్పటికే జడ్పీ చైర్మన్‌గా ఉన్న బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 2019లో వైసీపీ నుంచి మరోసారి విజయం సాధించారు. జడ్పీ చైర్మన్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన బడ్డుకొండ వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరడం ఆ పార్టీకి తీరని లోటే.

బొత్స శిబిరంలో ఆందోళన

జిల్లాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం బలమైన రాజకీయ శక్తిగా ఉండేది. దశాబ్దాలుగా వారి హవా నడిచింది. అయితే, 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో జిల్లాలో వైసీపీ తుడుచుకుపోయింది. అప్పటి నుంచి బొత్స కోటకు బీటలు ఏర్పడడం ప్రారంభ మయ్యాయి. కుటుంబంలో కూడా చీలిక కనిపిస్తోంది. తొలుత తన మేనల్లుడు, మాజీ జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఇప్పుడు బొత్స సమీప బంధువు, చిన్న శ్రీను బావ, వియ్యంకుడైన బడ్డుకొండ అప్పలనాయుడు సైతం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇలా ఆ కుటుంబ నుంచి ఒక్కో బలమైన నేత బయటకు వస్తుండడంతో బొత్స వర్గంలో ఆందోళన మొదలైంది. ప్రధానంగా స్థానిక ఎన్నికల వేళ ఈ పరిణామాలు వారిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

Updated Date - Oct 30 , 2026 | 11:51 PM