Share News

bad position in libraries గ్రంథాలయాలు ఇంతేనా?

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:37 AM

bad position in libraries విజ్ఞాన భాండాగారాలుగా పిలుపుచుకునే గ్రంథాలయాలు నిర్వహణలో దయనీయంగా మారుతున్నాయి. అక్కడ చదువుకునేందుకు నిరుద్యోగుల్లో ఆసక్తి కలగకపోగా అటువైపే చూడడం లేదు. ఎలాంటి పుస్తకం కావాలన్నా అక్కడ దొరుకుతుందనే భరోసా పాఠకులకు కలగడం లేదు.

bad position in libraries గ్రంథాలయాలు ఇంతేనా?
మెంటాడ గ్రంథాలయం

గ్రంథాలయాలు ఇంతేనా?

గాడి తప్పుతున్న వైనం

సిబ్బంది కొరతతో మూత దిశగా కొన్ని..

ఉమ్మడి జిల్లాలో ఖాళీగా 60 ఉద్యోగాలు

చైర్మన్‌ నియామకంతో నిరుద్యోగుల్లో ఆశలు

విజయనగరం టౌన్‌, మార్చి1(ఆంధ్రజ్యోతి):

విజ్ఞాన భాండాగారాలుగా పిలుపుచుకునే గ్రంథాలయాలు నిర్వహణలో దయనీయంగా మారుతున్నాయి. అక్కడ చదువుకునేందుకు నిరుద్యోగుల్లో ఆసక్తి కలగకపోగా అటువైపే చూడడం లేదు. ఎలాంటి పుస్తకం కావాలన్నా అక్కడ దొరుకుతుందనే భరోసా పాఠకులకు కలగడం లేదు. మొత్తంగా జిల్లాలో చాలా గ్రంథాలయాలు కొన్నేళ్లుగా నిర్లక్షానికి గురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చాలా గ్రంథాలయాలు సమయానికి తెరుచుకోవడమే లేదు. కొన్నిచోట్ల సిబ్బందికి బదులు స్థానికులు నిర్వహణ చూస్తున్నారు. మరోవైపు అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేక వెలవెలబోతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కానరాకపోవడంతో సిబ్బంది ఇష్టారీతిలో విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి.

విజయనగరంలో 30, పార్వతీపురం జిల్లాలో 11 కలిపి మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 41గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రంథాలయాధికారి, జూనియర్‌, సీనియర్‌ సహాయకులు, అటెండర్స్‌, హెల్ప్‌ర్స్‌(సహాయకులు), రికార్డు అసిస్టెంట్స్‌, పార్ట్‌టైం వర్కర్స్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కలిపి రెండు జిల్లాల్లో 60ఖాళీగా ఉన్నాయి. 26మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. గ్రామాల్లో నిర్వహించే గ్రంథాలయాలు సిబ్బంది కొరతతో గాడి తప్పుతున్నాయి. జిల్లా కేంద్రంలోని గాజులరేగ గ్రంథాలయంలో ఎప్పుడూ సిబ్బంది కనిపించడం లేదు. దత్తిరాజేరు గ్రంథాలయం సిబ్బంది లేక తెరుచుకోవడమే లేదు. మెంటాడలో గ్రంథాలయాధికారి సెలవు పెడితే నిర్వహించే నాథుడు లేడు. ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని 41 గ్రంథాలయాల్లో 26 చోట్లే సొంత భవనాలు ఉన్నాయి. చాలా చోట్ల మరుగుదొడ్లు లేవు. తాగునీరు సరఫరా చేయలేకపోతున్నారు.

సిబ్బంది రావడం లేదు

మెంటాడ మండల కేంద్రంలోని గ్రంథాలయానికి సిబ్బంది రావడం లేదు. ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో తెలియడం లేదు. కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, తాగునీరు అందివ్వరు. పోటీపరీక్షల పుస్తకాలు లేవు. ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు.

- మండల సురేష్‌, మెంటాడ

సరిచేస్తాం

ఉమ్మడి జిల్లాలో 41 గ్రంథాలయాలకు గాను 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీచేస్తే నిర్వహణ సక్రమంగా సాగుతుంది. మెంటాడ, దత్తిరాజేరు గ్రంథాలయాలు సక్రమంగా లేవని ఫిర్యాదులు అందాయి. పర్యవేక్షించి సరిచేస్తాం. ఇటీవల చైర్మన్‌ నియామకంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చేలా చైర్మన్‌ దృష్టిలో పెడతాం.

- బి.లక్ష్మి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, విజయనగరం

Updated Date - Mar 02 , 2026 | 12:37 AM