Back into the ocean... తిరిగి సంద్రంలోకి..
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:14 AM
Back into the ocean... చేపల వేటకు వేళ అయింది. 61 రోజుల తర్వాత మళ్లీ సంద్రంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. విరామ సమయంలో సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడిన గంగపుత్రులు హమ్మయ్యా అనుకుంటున్నారు.
తిరిగి సంద్రంలోకి..
వేట నిషేధం గడువు పూర్తి
నేటి అర్ధరాత్రి నుంచి తిరిగి వేటకు పయనం కానున్న మత్స్యకారులు
భోగాపురం, జూన్ 13(ఆంధ్రజ్యోతి): చేపల వేటకు వేళ అయింది. 61 రోజుల తర్వాత మళ్లీ సంద్రంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. విరామ సమయంలో సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడిన గంగపుత్రులు హమ్మయ్యా అనుకుంటున్నారు. వేట కోసం సరంజామాను సిద్ధం చేసుకున్నారు. బోట్లకు చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసుకున్నారు. వలలు, ఇతర పరికరాలు, డీజిల్‌ను ఓ పక్కన భద్రపరిచారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కాని, సోమవారం వేకువజామున కాని బయలుదేరనున్నారు.
చేపల సంతతి వృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఏటా 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు నిషేధం అమలు చేసింది. ఈ సమయంలో తెప్ప బోటుతో మాత్రమే నిర్ణీత దూరం వరకు వేటకు అవకాశం ఉంటుంది. విరామ సమయంలో మోటారు బోట్లపై చేపల వేటకు వెళ్లకూడదు. ఈ గడువు పూర్తికావస్తుండడంతో మత్స్యకారులు వేటకు సన్నద్ధమవుతున్నారు. 14వ తేదీ అర్ధరాత్రి నుంచి వేట సాగించేందుకు చూస్తున్నారు. ఇదిలా ఉండగా వేట నిషేధ సమయంలో అర్హులైన మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార సేవలో పథకం కింద ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.20వేలు చొప్పున భృతి అందజేస్తోంది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం రెండో విడతగా మత్స్యకారుల సేవలో పథకాన్ని అందజేసింది. అయితే ఇతర పనులేవీ చేయలేక వారు కాస్త ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. వేట నిషేధ గడువు ఎప్పుడు ముగిస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చారు. గడువు పూర్తికావడంతో అన్నిరకాల వేట సామగ్రిని సిద్ధం చేసుకున్నారు.