Baby kits బేబీ కిట్లు వచ్చేస్తున్నాయ్!
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:47 PM
“Baby kits are on the way!” ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వారికి బేబీ కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఇటీవల ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో కన్నా మెరుగైన కిట్లతో బ్యాగ్ ఇవ్వాలని నిర్ణయం
జిల్లావాసుల హర్షం
జియ్యమ్మవలస, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వారికి బేబీ కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఇటీవల ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రిలో ప్రసవమైన తర్వాత తల్లీబిడ్డలను ప్రత్యేక వాహనాల్లో ఇంటికి చేర్చుతున్న ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి
- జిల్లాలో మూడు ఏరియా ఆసుపత్రులు, మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు అర్బన్ పీహెచ్‌సీలు, 37 పీహెచ్‌సీలు ఉన్నాయి. పార్వతీపురంలో జిల్లా కేంద్రాసుపత్రితో కలుకుని వాటి పరిధిలో ఏటా 10 వేల మందికి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డకు ఇన్‌ఫెక్సన్ సోకకుండా ఉండేందుకు బేబీ కిట్లు అందించాలని 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం యోచించింది. ఈ మేరకు 2016లో కేంద్ర ప్రభుత్వ జాతీయ హెల్త్ మిషన్ సౌజన్యంతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అప్పట్లో రూ. 800 విలువ చేసే ఎన్టీఆర్ బేబీ కిట్లును అందించింది. ఈ బేబీ కిట్లులో చేతులు శుభ్రం చేసుకునే లిక్విడ్, దోమ తెర గొడుగు, న్యాప్‌కిన్లు, చిన్న పరుపు, బేబీ సోప్ వంటివి ఉండేవి. ఈ బ్యాగ్‌తో బాలింతలు తమ పిల్లలను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లేవారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ బేబీ కిట్లు ఇవ్వడం పక్కన పెట్టేసింది.
- గతంలో కంటే మెరుగ్గా మళ్లీ బేబీ కిట్లు పంపిణీకి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో కేవలం ఐదు రకాల వస్తువులుండగా.. ఈ సారి రూ. 1,400 విలువ గల 14 రకాల వస్తువులతో కూడిన బేబీ కిట్టు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన బాలింతలకు ఇవ్వనున్నారు. ఒక్కో కిట్టులో దోమ తెరతో పాటు బేబీ బెడ్డు, బేబీ దస్తులు, టవల్, రీయూజబుల్ న్యాపీలు, పౌడరు, షాంపు, బేబీ ఆయిల్, సబ్బు, రాటిల్ టాయ్ వంటివి కిట్టు బ్యాగులో ఉంటాయి.
త్వరలో వస్తాయి
ఆసుపత్రిలో ప్రసవించిన ప్రతి శిశువుకు బేబీ కిట్లు ఎంతో అవసరమని ప్రభుత్వం గుర్తించింది. తదనుగుణంగా చర్యలు తీసుకుంది. జిల్లాకు త్వరలోనే బేబీ కిట్లు వస్తాయి.
- జి.నాగభూషణరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త, పార్వతీపురం మన్యం