Share News

ఘోషాసుపత్రిలో శిశువు మృతి

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:53 PM

మాతృ, శిశు మరణాలు సంభవించకూడదని.. ప్రతి ప్రాణం విలువైనదని ప్రభుత్వం పదేపదే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం అవి ఆగడం లేదు.

ఘోషాసుపత్రిలో శిశువు మృతి
శిశువు మృతిచెందడంతో రోదిస్తున్న బంధువులు

- పాలు పడుతుండగా చలనం కోల్పోయిన వైనం

-శిశువును మోసుకుంటూ ఎస్‌ఎన్‌సీయూకి తీసుకెళ్లిన బంధువులు

- వార్డులోని సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణ

- పొలమారటంతో ఊపిరాడక మృతి చెందాడంటున్న వైద్యులు

విజయనగరం రింగురోడ్డు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): మాతృ, శిశు మరణాలు సంభవించకూడదని.. ప్రతి ప్రాణం విలువైనదని ప్రభుత్వం పదేపదే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం అవి ఆగడం లేదు. విజయనగరం ఘోషాసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. శిశువుకు పాలు పడుతుండగా పొలమారటంతో మృతి చెందినట్లు వైద్యులు, సిబ్బంది చెబుతున్నారు. అయితే, అందుకు గల కారణాలను వివరించడంలో, రికార్డులో నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తమ బిడ్డ మృతికి గల కారణాలను వైద్య సిబ్బంది స్పష్టంగా వివరించకుండా మృతదేహాన్ని హడావిడిగా ఆసుపత్రి నుంచి తీసుకువెళ్లమంటూ సిబ్బంది ఒత్తిడి చేశారని శిశువు తండ్రి మహేష్‌ ఆరోపిస్తున్నాడు.

నగరంలోని బొగ్గులదిబ్బకు చెందిన కందివలస చిన్నితల్లి అనే గర్భిణి ఈ నెల 24న ఘోషాసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్యులు ఆపరేషన్‌ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లికి పాలు పడకపోవడంతో శిశువుకు డబ్బాపాలు పట్టాలని సూచించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వార్డులో చిన్నితల్లి బంధువు శిశువుకు డబ్బాపాలు పడుతుండగా ఉన్నట్టుండి చలనం కోల్పోవడంతో వెంటనే పైఅంతస్థులో ఉన్న ఎస్‌ఎన్‌సీయూ వార్డుకి శిశువును తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. పాలు పొలమారడంతో ఊపిరి అందక శిశువు చనిపోయాడని తెలిపారు. అయితే మృతదేహాన్ని హడావిడిగా ఆసుపత్రి నుంచి తీసుకువెళ్లమని సిబ్బంది ఒత్తిడి చేశారని, శిశువు తండ్రి మహేష్‌ ఆరోపిస్తున్నాడు. శిశువుకు ఏదైనా సమస్య ఉంటే వార్డులో ఉన్న నర్సులు ఇతర సిబ్బంది గమనించి పిడియాట్రీక్‌ విభాగానికి సమాచారం అందించాలని, కానీ వారు పట్టించుకోకపోవడంతో తామే శిశువును పై అంతస్థులో ఉన్న ఎస్‌ఎన్‌సీయూ వార్డుకి తీసుకువెళ్లామని చెబుతున్నాడు. తన బిడ్డ మరణానికి గల కారణాలను వైద్యులు సరిగా చెప్పడం లేదని అంటున్నాడు. పిడియాట్రీక్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నారాయణరావు మాట్లాడుతూ.. సాఽధారణంగా శిశువుకు ఇటువంటి సమయాల్లో స్ఫూన్‌ ఫీడింగ్‌ (చెంచాతో పాలు పట్టడం) చేయాలని పేర్కొన్నారు. అయితే వీరు సరిగా పాలు పట్టకపోవడంతో శిశువు పొలమారి ఊపిరాడక మృతి చెందినట్టు తెలిపారు.

సిబ్బంది నిర్లక్ష్యమేనా?

పాలు పడుతుండగా పొలమారిన శిశువును అక్కడే వార్డులో ఉన్న నర్సింగ్‌ సిబ్బంది ఎందుకు గమనించలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆక్సిజన్‌ సపోర్టుతో ఎస్‌ఎన్‌యూ వార్డుకి తరలించాల్సిన సిబ్బంది అందుకు భిన్నంగా శిశువు బంధువులు ఎందుకు మోసుకురావల్సి వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతుంది. శిశువు మరణానికి కారణం పాలు పొలమారడమేనని చెబుతున్న వైద్యులు ఆ కారణాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారన్నది చర్చనీయాంశంగా మారింది. శిశువు తండ్రి చెబుతున్నట్టుగా స్పూన్‌ ఫీడింగ్‌పై సిబ్బంది అవగాహన కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ అధికారిక ‘డెత్‌ సమరీ’ అందజేయలేదు. కేవలం ప్రాథమిక అడ్మిషన్‌, ఓపీ పత్రాలను బాధితుల చేతిలో పెట్టి వారిని హడావిడిగా బయటకు పంపించేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jan 27 , 2026 | 11:53 PM