Nutritious Food పౌష్టికాహార ప్రాధాన్యంపై అవగాహన
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:49 PM
Awareness on the Importance of Nutritious Food పౌష్టికాహార ప్రాధాన్యంపై గర్భిణులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ సిబ్బందికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
పార్వతీపురం, ఏప్రిల్21(ఆంధ్రజ్యోతి): పౌష్టికాహార ప్రాధాన్యంపై గర్భిణులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ సిబ్బందికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు విధిగా పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి .. మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. మాతా శిశు మరణాలను నివారిం చాలన్నారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను అంగన్‌వాడీలకు పంపిస్తుండడం అభినందనీయమని తెలిపారు. సాధారణ ప్రసవాల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని జిల్లాలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాయని వెల్లడించారు. పిల్లలకు ఇంటి కంటే మెరుగైన ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే నిలయాలుగా అంగన్‌వాడీ కేంద్రాలు మారాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీవో విజయగౌరి తదితరులు పాల్గొన్నారు.
మెగా కోలాటం ప్రదర్శన వాయిదా
జిల్లాకేంద్రంలో బుధవారం నిర్వహించాల్సిన భారీ మెగా కోలాటం ప్రదర్శనను వాయిదా వేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని విలేఖర్లకు తెలిపారు. ఈ ప్రదర్శన కోసం విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా శిక్షణ పొందారని, అయినప్పటికీ వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని వాయిదా వేశామని వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంలో కూడా కొందరు విద్యార్థులు ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. త్వరలోనే ఈ కార్యక్రమం చేపడతామన్నారు.