Awaiting Modernization ఆధునికీకరణకు ఎదురుచూపు
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:20 AM
Awaiting Modernization తోటపల్లి ప్రాజెక్టు పాత రెగ్యులేటర్ పరిధిలో ఆధునికీకరణ పనుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపో వడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కాలువలు, షట్టర్లు అధ్వానంగా మారాయి. పిచ్చిమొక్కల నడుమ స్లూయిస్‌లు దర్శనమిస్తున్నాయి.
25 శాతానికి మించని పనులు
తోటపల్లి పాతరెగ్యులేటర్ పరిధిలో అధ్వానంగా కాలువలు, షట్టర్లు
పిచ్చిమొక్కలతో నిండిన స్లూయిస్‌లు
ఖరీఫ్‌కు సాగునీటి సరఫరాపై రైతుల ఆందోళన
కూటమి ప్రభుత్వంపై ఆశలు
గరుగుబిల్లి, ఏప్రిల్20(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పాత రెగ్యులేటర్ పరిధిలో ఆధునికీకరణ పనుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపో వడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కాలువలు, షట్టర్లు అధ్వానంగా మారాయి. పిచ్చిమొక్కల నడుమ స్లూయిస్‌లు దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 25 శాతానికి మించి నిర్మాణాలు జరగకపోగా.. మరోవైపు ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండడంతో సాగునీటి సరఫరాపై రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- బ్రిటిష్ హయాంలో (1908) రెగ్యులేటర్‌కు సంబంధించి ఎడమ, కుడి కాలువల నిర్మాణం చేపట్టారు. గరుగుబిల్లి మండలం నుంచి సుమారు 37.52 కిలో మీటర్ల మేర ఎడమ ప్రధాన కాలువను ఏర్పాటు చేశారు. దీని పరిధిలో గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస వరకు ఉన్న 35 వేల ఎకరాలతో పాటు కుడి కాలువకు సంబంధించి 9 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. ఇక కుడి ప్రధాన కాలువ పరిధిలో గరుగుబిల్లి, బలిజిపేట, వంగర మండలాలకు సంబంధించి సుమారు 20 కిలో మీటర్ల పరిధిలో 9 వేల ఎకరాలకు సాగునీటికి ప్రతిపాదించారు. మొత్తంగా రెండు కాలువల పరిధిలో 64 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు చర్యలు చేపట్టారు. వాటికి అనుసంధానంగా ఓపెన్ హెడ్ చానల్స్ నిర్మించారు.
-బ్రిటిష్ కాలంలో నిర్మాణం చేపట్టినవన్నీ శిఽథిలావస్థకు చేరుకోవడంతో 2018లో టీడీపీ ప్రభుత్వం ఆధునికీకరణకు రూ. 193 కోట్లు మంజూరు చేసింది. ఆ సమయంలో 23 శాతం మేర చేపట్టారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులకు బ్రేక్ పడింది. 2020లో పూర్తిస్థాయిలో పనులు నిలిచిపోగా, 2021, 2022లో కొంతమేర నిర్మాణాలు చేపట్టారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో 2023, 2024లో పనులేవీ జరగలేదు. రూ. 17 కోట్ల వరకు బిల్లులు బకాయిలున్నా.. గత ప్రభుత్వం స్పందించలేదు.
-మొత్తంగా ఆ సమయంలో 37.62 కిలో మీటర్లకు గాను 16 కిలో మీటర్ల మేర లైనింగ్ పనులు నిర్వహించారు. కుడి కాలువకు సంబంధించి 17.616 కిలో మీటర్లకు గాను 9.37 కిలో మీటర్ల మేర కాంక్రీటు పనులు నిర్వహించారు.
-ఎడమ ప్రధాన కాలువ పరిధిలో 8 బ్రాంచ్‌లు, కుడి కాలువ పరిధిలో 8 బ్రాంచి పనులు నిర్వహించాల్సి ఉంది. 267 వరకు ఆక్విడెక్టులు, సూపర్ పాసేజ్‌లు, అండర్ టన్నెళ్లు, ఔట్‌లెట్‌లు, డ్రాపులు, ఓటీ స్లూయిస్‌లు నిర్మించాల్సి ఉంది.
పిచ్చి మొక్కల నడుమ సైపూన్‌లు
తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని పలు సైపూన్‌లు, రక్షణ గోడలు, కల్వర్టులు పిచ్చి మొక్కలతో నిండుకున్నాయి. అదేవిధంగా జియ్యమ్మవలస మండలం చినకుదమ, తురకనాయుడు వలసకు ఆనుకుని నిర్మించిన ప్రధాన కల్వర్టు ప్రమాకరంగా మారింది. ఇది ఏ నిమిషయం కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ద్విచక్ర వాహనదారులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
ప్రతిపాదనలు పంపించాం..
తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ, కుడి ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులకు రూ.258 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. పాత ఎస్టిమేట్లను రివైజ్ చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఖరీఫ్‌కు సాగునీరందించేలా చర్యలు తీసుకుంటాం.
- డీవీ రమణ, జేఈ, పాత రెగ్యులేటర్, వీరఘట్టం సెక్షన్