లారీ ఢీకొని ఆటో డ్రైవరు మృతి
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:11 AM
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళుతున్న లారీ ఢీకొట్టడంతో ఆటో నడుపుతున్న కొండల నర్సింహారెడ్డి(40) మృతి చెందాడు.
భీమునిపట్నం (రూరల్), ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళుతున్న లారీ ఢీకొట్టడంతో ఆటో నడుపుతున్న కొండల నర్సింహారెడ్డి(40) మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింహారెడ్డిని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడని ఎస్‌ఐ పి.సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నర్సింహారెడ్డిది విజయనగరం జిల్లా భోగాపురం మండలం దల్లిపేట గ్రామం. ఇతను మూలకుద్దు గ్రామానికి రోజూ విద్యార్థులను ఆటోలో తీసుకుని వస్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులను దింపిన తర్వాత చిప్పాడలోని బంధువుల ఇంటిలో భోజనం చేశాడు. తిరిగి విద్యార్థులను ఆటోలో తరలించడానికి వస్తున్న క్రమంలో అవంతి కళాశాల వద్దకు చేరుకుని, జాతీయ రహదారి పక్క పున్నమి రెస్టారెంటుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కాళ్లు రెండూ విరిగిపోయి నడుం భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే 108లో కేజీహెచ్‌కు తరలించారు. ఇతని భార్య కొండల ఉష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, లారీ డ్రైవరు అసకపల్లి విజయబాబును అరెస్టు చేశారు.