Delightful ఆకర్షణీయం.. ఆహ్లాదకరం
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:13 PM
Attractive and Delightful ఆకర్షణీయ.. ఆహ్లాదకర పర్యాటక కేంద్రం.. ప్రకృతి ఒడిలో ఒదిగి ఉన్న కుసులోయ జలపాతాల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ విప్ జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో ఈ ప్రాంతం.. రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందన్నారు.
ప్రభుత్వ విప్ జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
గుమ్మలక్ష్మీపురం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఆకర్షణీయ.. ఆహ్లాదకర పర్యాటక కేంద్రం.. ప్రకృతి ఒడిలో ఒదిగి ఉన్న కుసులోయ జలపాతాల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ విప్ జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో ఈ ప్రాంతం.. రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందన్నారు. కుశ గ్రామస్థుల శ్రమదానంతో రూపుదిద్దుకున్న రహదారి, జలపాతం వద్ద ఏర్పాటు చేసిన వసతులను గురువారం వారు లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పర్యాటకుల సౌకర్యం కోసం ఈ ప్రాంత గిరిజనులు ఎంతో శ్రమించారని విప్ జగదీశ్వరి అన్నారు. కుశ లోయ వద్ద మట్టిమెట్లు, సపోర్టు కర్రలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శని, ఆదివారాల్లో కుసులోయకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్టు చెప్పారు. గుమ్మలక్ష్మీపురం నుంచి రెంటల్ బైక్స్ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ‘జలపాతం వద్ద పర్యాటకులు దారి తప్పకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్లలో క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయిస్తాం. స్థానిక యువతకు ట్రెక్కింగ్ గైడ్లుగా తర్ఫీదు ఇప్పిస్తాం. అత్యవసర చికిత్స కోసం ఉచితంగా శిక్షణ ఇస్తాం. పర్యాటకులు ఈ ప్రాంతంలో ముందుస్తుగా భోజనం, ఇతర వసతులు బుక్ చేసుకునేలా ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం.’ అని తెలిపారు. కుశ లోయ జలపాతాల్లో ఐదు నుంచి ఆరు అడుగుల లోతులో బౌల్ ఆకారంలో ఉన్న ప్రదేశం పర్యాటకులు ఈత కొట్టడానికి సురక్షితమని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. అంతకుముందు గ్రామస్థులు వారికి ఘన స్వాగతం పలికారు. విద్యార్థినులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, డీఈవో బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.