Share News

Attendance క్లాసులకు హాజరవ్వాల్సిందే..

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:26 AM

Attendance to Classes is Mandatory బీఈడీ అభ్యర్థులకు ముఖ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సక్రమంగా తరగతులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నట్లు తెలిపింది.

Attendance  క్లాసులకు హాజరవ్వాల్సిందే..

  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. అక్రమాలకు చెక్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): బీఈడీ అభ్యర్థులకు ముఖ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సక్రమంగా తరగతులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నట్లు తెలిపింది. దీంతో ప్రైవేట్‌ బీఈడీ కళాశాలల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అక్రమాలకు ప్రభుత్వం చెక్‌ పెట్టినట్లు అయ్యింది. జిల్లాలో సాలూరు, పాలకొండ, మరిపివలస, పార్వతీపురం, బలిజిపేట తదితర ప్రాంతాల్లో ప్రైవేట్‌ బీఈడీ కళాశాలలున్నాయి. అయితే ఆయా కళాశాలలు పేరుకే అన్నట్టుగా మారాయి. వాటిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ‘తరగ తులకు హాజరుకాకపోయినా పర్వాలేదు.. పరీక్షలకు వస్తే సరిపోతుంది.. మేము చెప్పిన ఫీజు చెల్లిస్తే చాలు.’ అని కొన్ని కళాశాలలు అభ్యర్థులకు చెబుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఒడిశాకి చెందిన కొంతమంది అభ్యర్థులు జిల్లా కాలేజీల్లో చేరి మమ అనిపిస్తున్నారు. ఆ తర్వాత పరీక్షలకు మాత్రమే బీఈడీ పాస్‌ అవుతున్నారు. ఆంధ్రాలో బీఈడీ పూర్తి చేసిన వారికి ఒడిశా రాష్ట్రంలో పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఒడిశాకు చెందిన వారు జిల్లాలో ప్రైవేట్‌ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు.

- కొండ శిఖర గ్రామాల్లో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు సైతం బీఈడీ చదువు కోసం సెలవు పెడుతున్నారు తప్పితే.. కళాశాలకు మాత్రం వెళ్లడం లేదు. ఇంటి వద్దే ఉండి బీఈడీకి ప్రిపేర్‌ అవుతున్నారు. దీనివల్ల బాగా చదువుకుంటున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. మొత్తంగా కళాశాలలకు వెళ్లకుండా బీఈడీ పూర్తి చేసుకున్న వారు ఉపాధ్యాయుల పోస్టులకు పోటీ పడుతుండడంతో జిల్లాలో అర్హులకు అన్యాయం జరుగుతుంది.

- ఇటువంటి అక్రమాలకు చెక్‌ పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ హాజరు తప్పనిసరి చేయడంతో ఇకపై బీఈడీ అభ్యర్థులు తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. లేకుంటే ఇబ్బందులు తప్పవు. హాజరు శాతం తక్కువగా ఉంటే పరీక్షలకు హాజరయ్యేందుకు అనర్హులవుతారు.

Updated Date - Apr 16 , 2026 | 12:26 AM