Share News

ఎమ్మెల్యే జగదీశ్వరిపై దాడియత్నం

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:21 AM

మండలంలోని అర్నాడ పంచా యతీలో కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరిపై జనసేన కార్యకర్తలు దాడికి యత్నించారు.

ఎమ్మెల్యే జగదీశ్వరిపై దాడియత్నం
అర్నాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న దృశ్యం

  • అర్నాడలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ

జియ్యమ్మవలస, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అర్నాడ పంచా యతీలో కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరిపై జనసేన కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈమేరకు టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శనివారం ఉదయం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ప్రచారం నిమిత్తం జగదీశ్వరి అర్నాడ పంచాయతీ కేంద్రానికి వచ్చారు. ఆమె రాకను ముందే గుర్తించిన కురుపాం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు తన అనుయాయులతో అక్కడకు వచ్చారు. జగదీశ్వరి రాగానే జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి జోగి ప్రసాదమ్మ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ వారు నినాదించడంతో టీడీపీ వర్గీయులు ఆమెకు అండగా నిలిచి నినాదాలు చేశారు. తర్వాత అర్నాడలో ఎమ్మెల్యే జగదీశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా పోటీగా జనసేన వర్గీయులు కూడా నినాదాలతో హోరెత్తించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే జగదీశ్వరితో మాజీ ఎమ్మెల్యే జయరాజు మాట్లాడుతుండగా ఇరువర్గాలు భౌతిక దాడు లకు సిద్ధంకావడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జగదీశ్వరి జనసేనకార్యకర్తల ప్రవర్తనను తప్పుపట్టారు. ఇంతలో చినమేరంగి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టీవీ తిరుపతిరావు, జియ్యమ్మవలస ఎస్‌ఐ ఎన్‌.ప్రశాంత్‌కుమార్‌లు సిబ్బందితో వచ్చి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బి.సురేష్‌, అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 12:21 AM