Share News

సుత్తితో దాడి చేసి..

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:06 AM

కొత్తవలస పంచాయతీలోని కొత్తవలస- కె.కోటపాడు రోడ్డులో గల ఒక ప్రైవేటు కళాశాల ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ స్టోర్‌లో ఉన్న మహిళ తలపై సుత్తితో దాడి చేసి.. మెడలోని బంగారు తాడును దొంగిలించడానికి ప్రయత్నించిన ఓ మహిళను అరెస్టు చేశామని సీఐ షణ్ముఖరావు తెలిపారు.

సుత్తితో దాడి చేసి..

కొత్తవలస, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): కొత్తవలస పంచాయతీలోని కొత్తవలస- కె.కోటపాడు రోడ్డులో గల ఒక ప్రైవేటు కళాశాల ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ స్టోర్‌లో ఉన్న మహిళ తలపై సుత్తితో దాడి చేసి.. మెడలోని బంగారు తాడును దొంగిలించడానికి ప్రయత్నించిన ఓ మహిళను అరెస్టు చేశామని సీఐ షణ్ముఖరావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేట గ్రామానికి చెందిన పొలమరశెట్టి పుష్ప అనే మహిళ కె.కోటపాడు రోడ్డులోని ప్రైవేటు కళాశాల ఎదురుగా ఫ్యాన్సీ స్టోర్‌ను ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తోంది. గురువారం ఫ్యాన్సీ స్టోర్‌కు ఓ మహిళ గాజులు కొనడానికి వచ్చినట్టు వచ్చి.. పుష్ప తలపై సుత్తితో కొట్టి, మెడలో ఉన్న బంగారు తాడును దొంగిలించడానికి ప్రయత్నించింది. వెంటనే పుష్ప కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు రావడంతో ఆ మహిళ పరారీ అయింది. ఈమేరకు పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు.. అనకాపల్లి జిల్లా, కావికమతం మండలం, మర్రివలస గ్రామానికి చెందిన మల్లా సుభద్రమ్మగా పోలీసులు గుర్తించారు. సుభద్రమ్మ కన్నవారు మండలంలోని కంటకాపల్లి పంచాయతీ కొత్తసుంకరపాలెం అని గుర్తించారు. ఆమెకు ఆర్థిక సమస్యలు ఉండడంతో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి, బంగారు ఆభరణాలు దోచుకుంటోందని చెప్పారు. సుభద్రమ్మను అరెస్టు చేసి, కొత్తవలస కోర్టులో హాజరు పరిచారు.

Updated Date - Apr 10 , 2026 | 12:06 AM