Share News

మూకుమ్మడిగా వచ్చి.. దాడి చేసి

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:00 AM

Attacked in a Group.. తొలి విడత పంచాయతీ ఎన్నికల వేళ పార్వతీపురం మండలం ఎంఆర్‌ నగరంలో ఉద్రిక్తత నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరగనుండగా.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ గ్రామంలోని టీడీపీ నాయకులపై మూకుమ్మడిగా దాడి చేసి.. తీవ్రంగా కొట్టి గాయపరిచారు.

 మూకుమ్మడిగా వచ్చి.. దాడి చేసి
ఎంఆర్‌ నగరం గ్రామస్థులను విచారిస్తున్న పోలీసులు

  • తొలి విడత పంచాయతీ ఎన్నికల వేళ రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

  • 50 మంది మూకుమ్మడిగా వచ్చి.. ఆ గ్రామంలోని టీడీపీ నాయకులపై దాడి

  • సర్పంచ్‌ అభ్యర్థి చీర లాగి, జాకెట్‌ చించేశారని ఆరోపణ

  • నిందితులను అరెస్టు చేయాలని ఎమ్మెల్యే విజయచంద్ర ఆందోళన

  • గ్రామంలో 144 సెక్షన్‌ విధింపు.. పోలీసుల అదుపులో పలువురు వైసీపీ నాయకులు

  • మరికొందరు ఇళ్ల వెనుక నుంచి పారిపోయినట్లు గ్రామస్థుల వెల్లడి

పార్వతీపురం/పార్వతీపురం రూరల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తొలి విడత పంచాయతీ ఎన్నికల వేళ పార్వతీపురం మండలం ఎంఆర్‌ నగరంలో ఉద్రిక్తత నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరగనుండగా.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ గ్రామంలోని టీడీపీ నాయకులపై మూకుమ్మడిగా దాడి చేసి.. తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..

పార్వతీపురం మండలం ఎంఆర్‌నగరం పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో రొంపిల్లి సుభద్రమ్మ పోటీ చేస్తున్నారు. అయితే ఆమెతో పాటు భర్త రొంపిల్లి తిరుపతి, కుమారుడు ప్రభాకరరావు, వంగపండు త్రినాథనాయుడుపై బుధవారం ఉదయం 10 గంటలకు ఆ గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. టీడీపీ నాయకులు ఒంటరిగా ఉండడం చూసి సుమారు 50 మంది వైసీపీ మద్దతుదారులు దాడి చేశారు. తిరుపతిరావును నేలకేసి కొట్టి.. ప్రభాకరరావుపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. గాయపడిన టీడీపీ నాయకులను అంబులెన్స్‌పై పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. నాయకుడు బడే రామారావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు , కార్యకర్తలు దాడి చేసినట్లు టీడీపీ నాయకులు ఆరోపించారు. సర్పంచ్‌ అభ్యర్థి సుభద్రమ్మపై పప్పల ప్రసాద్‌, పప్పల హేమంత్‌ దాడి చేసి చీర లాగి, జాకెట్‌ చించేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పని చేశారనే కక్షతోనే ఈ దాడి చేశారని తెలిపారు. కాగా పార్వతీపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త బెలగాం జయ ప్రకాష్‌నారాయణ, కౌన్సిలర్‌ మధు తదితరులు ఎంఆర్‌ నగరం చేరుకుని బాధితులను పరామర్శించారు.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆందోళన

సమాచారం తెలుసుకున్న పార్వతీపురం రూరల్‌ పోలీసులు ఎస్‌ఐ రాజేష్‌ ఆధ్వర్యంలో ఎంఆర్‌నగరం చేరుకున్నారు. బడే రామారావు తదితర వైసీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా మరికొందరు వైసీపీ నాయకులు ఇళ్లలో దాక్కున్నారని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే విజయచంద్రకు వివరించారు. దీంతో దాడికి పాల్పడిన వారిని బయటకు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే విజయచంద్ర, ఎంపీపీ బోను దేవిచంద్రమౌళి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తదితరులు వైసీపీ నేతల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పోలీసులు ఇళ్లలో ఉన్న కొందరు వైసీపీ నాయకులను పోలీసు వ్యాన్‌లో తరలించారు. మరికొందరు ఇళ్ల వెనుక భాగం నుంచి పారిపోయినట్లు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఐ వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు ఆయా ఇళ్ల వద్దకు వెళ్లగా, అప్పటికే వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జోగారావు గ్రామంలోకి వచ్చి కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే విజయచంద్ర డిమాండ్‌ చేశారు. ఇళ్లలో దాక్కున్న వారిని బయటకు తీసుకువచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కాగా వైసీపీ నాయకులు గుంపులుగా పారిపోవడం వెనుక ఒక వైసీపీ కీలక నాయకుని ఆదేశాలు ఉన్నట్టు గ్రామస్థులు చర్చించుకోవడం కనిపించింది. ఇకపోతే ఈ ఘటనలో వైసీపీకి చెందిన తొమ్మిది మంది నాయకులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

ఒడిశాకు పరారైన వైసీపీ నాయకులు..!

టీడీపీ నాయకులపై దాడి చేసిన వైసీపీ నాయకుల్లో కొంతమంది జిల్లాకేంద్రానికి దగ్గరలో ఉన్న ఒడిశా రాష్ట్రంలోని గ్రామాల్లోకి పరారయ్యారని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వెంటనే ఒడిశాకు పారిపోయారని, వారిని పట్టుకుని జిల్లాకు తేవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి.

దారుణంగా కొట్టారు

టీడీపీ నాయకులను వైసీపీ నాయకులు దారుణంగా కొట్టారు. నా కళ్లముందే నా భర్త త్రినాథ్‌నాయుడుతో పాటు రొంపిల్లి తిరుపతిరావు, ప్రభాకరరావుపై దాడి చేశారు. టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న రొంపిల్లి సుభద్రమ్మ చీరను లాగి జాకెట్‌ చించేసిన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలి. ఈ నెల 24న వైసీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. అయితే టీడీపీ నాయకులు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయకుండా, పోలింగ్‌ జరిగినపప్పుడు అభ్యర్థి లేకుండా చేయడానికి వైసీపీ నాయకులు ఇదంతా చేశారు.

- వంగపండు లక్ష్మి, మాజీ సర్పంచ్‌, ఎంఆర్‌నగరం

==================================

వారిని కఠినంగా శిక్షించాలి

టీడీపీ నాయకులు రొంపిల్లి తిరుపతిరావు , ప్రభాకరరావు, వంగపండు త్రినాఽథనాయుడుపై దాడి చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిని చట్ట ప్రకారం శిక్షించాలి. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు కక్ష కట్టి దాడి చేశారు. వారిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు.

- బోను దేవిచంద్రమౌళి, ఎంపీపీ, ఎంఆర్‌ నగరం

==================================

కొందరిని అరెస్టు చేశాం

‘ఎంఆర్‌నగరంలో టీడీపీ నాయకులపై దాడి చేసినట్టు తెలియగానే వెంటనే ఆ గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చాం. బాధితుల ఫిర్యాదు మేరకు 9 మందిని అరెస్ట్‌ చేశాం. వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. గ్రామంలో 144 సెక్షన్‌ విధించాం.’ అని పార్వతీపురం రూరల్‌ ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

Updated Date - Nov 26 , 2026 | 12:00 AM