Share News

బాకీ డబ్బులు అడిగినందుకు దాడి

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:47 AM

తనకు రావాల్సిన బాకీ డబ్బులు అడిగినందుకు ఓ వృద్ధుడిపై ఒక వ్యక్తి దాడి చేశాడు.

బాకీ డబ్బులు అడిగినందుకు దాడి
సింహాచలం మృతదేహం, సింహాచలం (ఫైల్‌)

- తీవ్రంగా గాయపడిన వృద్ధుడు

-ఆస్పత్రికి వెళ్లలేక ప్రాణాలు వదిలిన వైనం

-పాతరేగలో దారుణం

రామభద్రపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): తనకు రావాల్సిన బాకీ డబ్బులు అడిగినందుకు ఓ వృద్ధుడిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు ఆస్పత్రికి వెళ్లలేక ఇంటి వద్దే ప్రాణాలు కోల్పోయిన ఘటన రామభద్రపురం మండలం పాతరేగ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పాతరేగ గ్రామానికి చెందిన యాసర్ల సింహాచలం (70)అనే వృద్ధుడికి అదే గ్రామానికి చెందిన పెద్దింటి తిరుపతి అనే వ్యక్తి వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాడు. శనివారం సాయంత్రం తన బాకీ డబ్బులు ఇవ్వాలని సింహాచలం.. తిరుపతిని అడిగాడు. దీంతో తిరుపతి ఆయనతో గొడవకు దిగి కొట్టడమే కాకుండా తోసివేయడంతో కుళాయి వద్ద ఉన్న దిమ్మపై సింహాచలం పడిపోయాడు. దీంతో ఆయన తలకు, ఒంటిపైనా బలమైన గాయాలయ్యాయి. సింహాచలం వృద్ధుడు కావడంతో ఆసుపత్రికి వెళ్లలేక ఇంటివద్దే ఉండిపోయాడు. అయితే, ఆదివారం తెల్లవారుజామున మంచంపై మృతి చెంది ఉన్నాడు. సింహాచలం ఉపాధి కోసం తాడేపల్లి గూడెంకు వెళ్లి ఇటీవలే పాతరేగ గ్రామానికి వచ్చాడు. భార్య అప్పయ్యమ్మతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. పిల్లలు లేరు. ఏకైక తోడైన భర్త చనిపోవడంతో భార్య తీవ్రంగా విలపిస్తోంది. మృతుని బంధువు ఔగడ్డి నారాయణరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:47 AM