Attacked by a Group! గుంపుగా వచ్చి.. దాడి చేసి!
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:34 AM
Attacked by a Group! పాలకొండవాసులను వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కోసారి పాదచారులు, వాహనదారుల వెంట పరుగుపెడుతూ దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కోసారి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పాదచారులు గాయాలతో ఆసుపత్రి పాలవుతున్నారు.
ఇటీవల పాలకొండలో చిన్నారిపై ఎనిమిది కుక్కల దాడి
వాహనచోదకులు, పాదచారులను వెంబడించి కాటు వేస్తున్న వైనం
భయాందోళన లో నగరపంచాయతీ వాసులు
పాలకొండ, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పాలకొండవాసులను వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కోసారి పాదచారులు, వాహనదారుల వెంట పరుగుపెడుతూ దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కోసారి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పాదచారులు గాయాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఇటీవల పట్టణంలోని జెట్టివారివీధి, సంతోషిమాత ఆలయం సమీపంలో చం ద్రసాహు, పుట్టా శ్రీహరితో పాటు తంపటాపల్లికి చెందిన రాము అనే వ్యక్తికి వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ నెల 2న సాయిదుర్గానగర్‌లోని ఆవు తనుష్య అనే చిన్నారి ఇంటి ముంగిట ఆడుతుండగా.. ఎనిమిది వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారి వద్దకు చేరుకుని కుక్కలను తరిమేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. ఇలా నగరపంచాయతీలో ఎంతోమంది వీధి కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్నారు.
పట్టణంలోని 20 వార్డుల పరిధిలో 40 వేలకు పైగా జనాభా ఉన్నారు. డివిజన్ కేం ద్రమైన పాలకొండకు అనునిత్యం వేలాది మంది విద్యార్థులు, వివిధ పనుల కోసం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే వీధి కుక్కల దాడిలో గాయపడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వీధి కుక్కల స్వైర విహారంపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్థానిక ప్రజలు, యువత అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నప్పటికీ సాంకేతిక ఇబ్బందులతో వాటిని నియం త్రించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా చికెన్ సెంటర్ల వద్ద వ్యర్థాలను వీధికుక్కలకు ఆహారంగా వేస్తుండడంతో అవి మరింత క్రూరంగా తయారవుతున్నాయి. రాత్రివేళల్లో రహదా రులపై నిర్మానుష్యంగా ఉన్న సమయాల్లో ఒంటరిగా వెళ్లేవారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. మూగజీవాలపైనా దాడి చేస్తున్నాయి. పదుల సంఖ్యలో పట్టణంలో వీధి కుక్కలు సంచరి స్తుండడంతో అన్ని వర్గాల వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
కమిషనర్‌కు వినతి...
నగర పంచాయతీలోని సాయిదుర్గానగర్‌లో చిన్నారిపై ఎనిమిది వీధి కుక్కల దాడి ఘటన నేపథ్యంలో స్థానికులు శనివారం కమిషనర్ నూకరాజును కలిశారు. కుక్కల దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడిందని, రాత్రివేళల్లో రాకపోకలు ఆగించే పెద్దలపై కూడా అవి గుంపులుగా దాడి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టి చిన్నారులు, నివాసితులకు రక్షణ కల్పించాలని వారు వినతిపత్రం అందించారు. ‘ పట్టణంలో ప్రధాన రహదారులపై సంచరిస్తూ దాడికి పాల్పడుతున్న కుక్కలను నియం త్రించేందుకు చర్యలు తీసుకుంటాం. వీధి కుక్కలను బంధించి వేరే చోటకు తరలిస్తాం. ఇందుకు ప్రణాళికలు రూపొందించాం. ’ అని నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు వెల్లడించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పి.గంగాధరరావు, సత్యనారాయణ, రఘు, కె.కె.రావు, కె.కోటి, బి.శివశంకర్ ప్రసాద్ తదితరులున్నారు.