Attack ఒంటరి వృద్ధురాలిపై దాడి
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:32 PM
Attack on an elderly woman living alone ఒంటరి వృద్ధురాలిపై ఓ వ్యక్తి దాడి చేసి.. ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును చోరీ చేశాడు. అయితే కొద్ది గంటల్లోనే నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గరుగుబిల్లి మండలంలో చోటు చేసుకుంది.
పోలీసుల అదుపులో నిందితుడు
గరుగుబిల్లి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఒంటరి వృద్ధురాలిపై ఓ వ్యక్తి దాడి చేసి.. ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును చోరీ చేశాడు. అయితే కొద్ది గంటల్లోనే నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గరుగుబిల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
సుంకి పంచాయతీ కొట్నాన రామినాయుడువలసకు చెందిన కోడి గౌరమ్మ గ్రామ శివారులో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె కుమారుడు ఉద్యోగరీత్యా విజయనగరంలో ఉంటున్నాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో వృద్ధురాలి ఇంటిలోకి ప్రవేశించాడు. గౌరమ్మపై దాడి చేసి.. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును అప హరించాడు. అయితే ఇదే సమయంలో వృద్ధురాలు గట్టిగా అరవడంతో పక్కనే ఉన్న చిన్నపాటి సుత్తితో ఆమె తలపై ఆ వ్యక్తి ఎనిమిదిసార్లు కొట్టి.. అక్కడి నుంచి పరారయ్యాడు. తలపై దెబ్బలు, రక్తంతో పడి ఉన్న గౌరమ్మను గ్రామస్థులు గుర్తించి 108 వాహనంపై పార్వతీపురం కేంద్రాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని అక్కడి వైద్య సిబ్బంది తెలిపారు. కాగా ఈ విషయం తెలియగానే ఎస్‌ఐ ఫకృద్ధీన్ వృద్ధురాలిని పరామర్శించి సమాచారం సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన బంకురు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.