Atrocity దారుణం
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:38 AM
Atrocity విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి (30)ని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హత్య చేశారు. తల పగిలిపోయి ఉండడంతోపాటు మెడకు నైలాన్‌తాడు బిగించి ఉంది. విశాఖ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
దారుణం
చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని సోదరికి చెప్పిన యువకుడు
గంటల వ్యవధిలో మృతి
విశాఖలో విజయనగరం జిల్లా మత్స్యకారుడి హత్య
భార్యతో విభేదాలు
విశాఖపట్నం/భోగాపురం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి (30)ని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హత్య చేశారు. తల పగిలిపోయి ఉండడంతోపాటు మెడకు నైలాన్‌తాడు బిగించి ఉంది. విశాఖ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మైలపల్లి చంటి కుటుంబం చాలాకాలం కిందట విశాఖ నగరానికి వచ్చి పెయిందొరపేటలో నివాసం ఉంటున్నది. చంటికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో కొద్దికాలంగా విభేదాలు ఉండడంతో చంటి తన సోదరి మెరుగు అప్పలకొండ ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు తనను చంపేస్తానంటూ కొందరు బెదిరిస్తున్నారని, ఈరోజు తనను చంపేస్తారని తన సోదరికి చెప్పాడు. అదే విషయాన్ని తాను ఉంటున్న ప్రాంతంలో తనకు పరిచయస్తులైన వారితో కూడా చెప్పాడు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన చంటి తిరిగి ఇంటికి చేరలేదు. సోమవారం తెల్లవారుజామున హార్బర్ సమీపంలోని గంగాలమ్మ తల్లి గుడి సమీపంలో ఒక మృతదేహం ఉందంటూ 112కి ఫోన్ రావడంతో వన్‌టౌన్ పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. మృతుడు చేపలవేటకు వెళ్లే మైలపల్లి చంటిగా స్థానికులు గుర్తించడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుడి తల పగిలిపోయి ఉండడం, మెడకు నైలాన్‌తాడు బిగించి ఉండడంతో ఎవరో చంటిపై కక్షతోనే పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పాల్గొనివుంటారని భావిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం, మృతుడు సెల్‌ఫోన్ వాడకపోవడంతో ఎవరు హత్యకు పాల్పడ్డారనే దానిపై పోలీసులు అంచనాకు రాలేకపోతున్నారు. కుటుంబ సభ్యులతోపాటు స్థానికంగా ఉన్న కొందరిని వివిధ కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.