ATM Theft ఏటీఎం చోరీ
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:11 AM
ATM Theft కొటారుబిల్లి కూడలిలో ఇండియా 1 ఏటీఎంలో దొంగలు పడ్డారు. ఏకంగా మిషీన్‌తో పాటు అందులో ఉన్న రూ.2,11,600 నగదును అపహరించారు. ఎస్‌ఐ సాయికృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి.
ఏటీఎం చోరీ
రూ.2.11 లక్షల నగదు కూడా మాయం
కొటారుబిల్లి కూడలిలో ఘటన
పరిశీలించిన ఎస్పీ దామోదర్
గంట్యాడ, ఆగస్టు 5(ఆంరఽధజ్యోతి): కొటారుబిల్లి కూడలిలో ఇండియా 1 ఏటీఎంలో దొంగలు పడ్డారు. ఏకంగా మిషీన్‌తో పాటు అందులో ఉన్న రూ.2,11,600 నగదును అపహరించారు. ఎస్‌ఐ సాయికృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి.
కొటారుబిల్లి కూడలిలో ఉన్న ఇండియా 1 ఏటీఎంలో మంగళవారం ఆర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి మిషీన్‌ను పట్టుకుపోయారు. లోపలి వైర్లను కట్ చేసి అమాంతం మిషీన్‌ను వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏటీఎంలో ఆ సమయానికి రూ.2,11,600 నగదు ఉంది. బుధవారం ఉదయం స్థానికులు చూసే సరికి మిషీన్ లేదు. వెంటనే గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి క్లూస్ టీం వచ్చి పరిశీలించారు. మధ్యాహ్నం ఎస్పీ దామోదర్ కూడా వచ్చి ఏటీఎంను పరిశీలించారు. నిత్యం జన సంచారంతో ఉన్న ఈ కూడలిలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఏటీఎంలో చోరీ జరగడం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.