నియోజకవర్గ స్థాయిలో
ABN , Publish Date - May 16 , 2026 | 12:25 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా రాజాం నియోజకవర్గస్థాయిలో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు.
తొలిసారిగా ఫిర్యాదుల స్వీకరణ
- ప్రజలకు చేరువగా ప్రభుత్వం
- సమస్యల పరిష్కారానికి చర్యలు
- కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
రాజాం, మే 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా రాజాం నియోజకవర్గస్థాయిలో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేథుమాధవన్ హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి సుమారు 90 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, పింఛన్లు, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రతీ ఫిర్యాదును పారదర్శకంగా పరిశీలించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో భాగంగా 18 మంది లబ్ధిదారులకు సుమారు రూ.13.54 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ.. రాజాం నియోజకవర్గంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రూ.2.50 కోట్లు వరకు లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు
వన్ విలేజ్.. వన్ మంత్.. ఫోర్ విజిట్స్..
ప్రభుత్వం చేపట్టిన వన్ విలేజ్.. వన్ మంత్.. ఫోర్ విజిట్స్ కార్యక్రమం ఉద్దేశాన్ని కలెక్టర్ వివరించారు. ప్రతీ గ్రామాన్ని అధికారులు నెలలో నాలుగు సార్లు సందర్శించి, ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేథుమాధవన్ మాట్లాడుతూ.. ‘వన్ విలేజ్ ’ కార్యక్రమంలో అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్ చేయాలని అధికారులకు సూచించారు. తదుపరి వారం ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, ఆర్డీవో సుధారాణి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు, రాజాం తహసీల్దార్ ఎం.రాజశేఖర్, వంగర, రేగిడి, సంతకవిటి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు