Share News

బొబ్బిలి గ్రోత్‌సెంటరులో

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:19 AM

బొబ్బిలి గ్రోత్‌సెంటరులో పర్యావరణ పరిరక్షణ కరువైంది. పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడుతుండడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

   బొబ్బిలి గ్రోత్‌సెంటరులో
గ్రోత్‌సెంటరులో పరిశ్రమ బయట రోడ్డు పక్కన పారబోసిన వ్యర్థాలు

పర్యావరణ పరిరక్షణ ఏదీ?

- నిబంధనలు పాటించని పరిశ్రమల నిర్వాహకులు

- ఖాళీ స్థలాల్లో కనిపించని మొక్కలు

- చోద్యం చూస్తున్న అధికారులు

- బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటరులో ఇటీవల పర్యావరణ విభాగం రాష్ట్ర చీఫ్‌ ఇంజనీర్‌ బడగల హరిధరరావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం సుస్థిర జీవనశైలి (మిషన్‌ లైఫ్‌) పేరుతో వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పరిశ్రమల నిర్వాహకులతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీ చేపట్టడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటు పడతామని ప్రతిజ్ఞ చేయించారు. అయితే, అవన్నీ అక్కడితోనే ఆగిపోయాయి.

బొబ్బిలి నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి గ్రోత్‌సెంటరులో పర్యావరణ పరిరక్షణ కరువైంది. పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడుతుండడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. భూగర్భ నీటి మట్టాలు సైతం 3-4 అడుగులకు పడిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇటీవల పాల్గొన్న ఎమ్మెల్యే బేబీనాయన గ్రోత్‌సెంటర్‌లోని పరిశ్రమలతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని బహిరంగంగానే చెప్పారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అమలు కాని నిబంధనలు..

పరిశ్రమల ప్రాంగణాల్లో 33 శాతం పచ్చదనానికి కేటాయించాలన్న నిబంధనను చాలా మంది తుంగలో తొక్కుతున్నారు. ఆ ఖాళీ స్థలాలను చాలా మంది ఓపెన్‌ గోదాములుగా వినియోగించుకుంటున్నారు. వీటన్నిటినీ కాలుష్యనియంత్రణ మండలి పకడ్బందీగా పర్యవేక్షించకుండా చోద్యం చూస్తోంది. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆ శాఖలో కదలిక శూన్యం. నిబంధన ప్రకారం పరిశ్రమల ఖాళీ స్థలాల్లో కచ్చితంగా మొక్కలు నాటాల్సిందే. భూగర్భజలాలను పెంచుకోవడానికి పెద్దఎత్తున ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. సోలార్‌ పవర్‌ వినియోగాన్ని పెంచుకోవాలి. నీటి వినియోగంతో పనిలేకుండా అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులోనికి వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అన్ని రకాల నియమాలను కచ్చితంగా పాటించాలి. ఇండస్ట్రియల్‌ లోకల్‌ ఏరియా అథారిటీ (ఐలా సొసొౖటీ )ని యాక్టివేట్‌ చేసుకోవడంలో చాలా అలసత్వం కనిపిస్తోంది.

చెట్లను నరికేశారు..

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రోత్‌సెంటరు పరిపాలనా కార్యాలయం ముందు సుమారు ఎకరన్నర స్థలంలో మొక్కలను నాటారు. ఆ మొక్కలు బాగా పెరిగాయి. అలాంటి చెట్లన్నిటినీ స్వయంగా అధికారులు నరికించేశారు. బ్యాలెట్‌ బాక్సుల పంపిణీ, సిబ్బందికి కౌంటర్లు ఏర్పాటు వంటి వాటి కోసం అధికారులు చెట్లను నరికివేసి అక్కడ టెంట్లు వేశారు. అప్పట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు దీనిని తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ అధికారులు పెడచెవిన పెట్టారు. నరికిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటుతామని ప్రకటించారు. మూడేళ్లు కావస్తున్నప్పటికీ ఇంతవరకు అక్కడ మొక్కలు వేసిన పాపాన పోలేదు. ఉన్న చెట్లను కాపాడుకోకుండా ఇలా పర్యావరణానికి చేజేతులా ముప్పు కలిగించడం పట్ల ప్రజలు, పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 25 , 2026 | 12:19 AM