Share News

At One’s Own Whim…! ఇష్టారాజ్యంగా..!

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:25 AM

At One’s Own Whim…! తురకనాయుడువలసలో ఎర్రగొల్ల సామాజిక వర్గానికి చెందిన వారిలో కొందరికి ఎస్టీ, మరికొందరికి ఎస్సీ, ఇంకొందరికి బీసీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. ఒక్క జియ్యమ్మవలస మండలంలోనే కాదు.. జిల్లాలో చాలాచోట్ల అధికారులు ఇలా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. దీంతో తమ సామాజిక వర్గం ఏమిటో తేల్చాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

At One’s Own Whim…! ఇష్టారాజ్యంగా..!
బలిజ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారని చూపుతున్న సింగనాపురం వాసి

  • దరఖాస్తు చేసుకున్న ప్రతీసారి కులం మార్చేస్తున్న వైనం

  • కొందరు వీఆర్‌వోలదే కీలక పాత్ర

  • చోద్యం చూస్తున్న అధికారులు

జియ్యమ్మవలస, ఏప్రిల్‌6(ఆంధ్రజ్యోతి):

- జియ్యమ్మవలస మండలం.. చింతలబెలగాం పంచాయతీ సింగానపురం గ్రామానికి చెందిన వాండ్రాశి అన్వేష్‌ అనే విద్యార్థికి 2021, జూలై 9న రజక (చాకలి) బీసీ-ఏ అంటూ ధ్రువీకరణ పత్రం (సీజీసీ012143534055) మంజూరు చేశారు. కానీ అదే వ్యక్తికి 2025, నవంబరు 10లో మళ్లీ బలిజ (ఓసీ) ధ్రువీకరణ పత్రం (ఆర్‌సీజీసీ251110044923) ఇచ్చారు. దీంతో ఆయన తీవ్ర ఆవే దన చెందుతున్నారు. వాస్తవానికి అన్వేష్‌ది రజక సామాజిక వర్గం.

- ఇదే మండలం తురకనాయుడువలసలో ఎర్రగొల్ల సామాజిక వర్గానికి చెందిన కుటుం బాలు 25 వరకూ ఉన్నాయి. వారిలో గొర్లి పాపారావుకు 2022, నవంబరు 16న యాదవ (బీసీ-డీ) అని ధ్రువీకరణ పత్రం (సీజీసీ221108019025) మంజూరు చేశారు. ఆయన తండ్రి కృష్ణకు 2018, జూన్‌ 2న ఎరుకులాస్‌ (ఎస్టీ) ధ్రువీకరణ పత్రం (సీజీసీ011817497555 ఇచ్చారు.

- అదే గ్రామం ఎర్రగొల్ల సామాజిక వర్గానికి చెందిన ఉల్లూరు గౌతంకు 2017, జూలై 14లో మాల (ఎస్సీ) ధ్రువీకరణ పత్రం (సీజీసీ011713548772) ఇచ్చారు.

.. ఇలా తురకనాయుడువలసలో ఎర్రగొల్ల సామాజిక వర్గానికి చెందిన వారిలో కొందరికి ఎస్టీ, మరికొందరికి ఎస్సీ, ఇంకొందరికి బీసీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. ఒక్క జియ్యమ్మవలస మండలంలోనే కాదు.. జిల్లాలో చాలాచోట్ల అధికారులు ఇలా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. దీంతో తమ సామాజిక వర్గం ఏమిటో తేల్చాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, భూపట్టాల మంజూరులో రెవెన్యూ శాఖాధి కారుల పాత్ర కీలకం. ప్రధానంగా కుల ధ్రువీకరణ పత్రం కోసం ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, చదువుకున్న సర్టిఫికేట్‌, గతంలో తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం కచ్చితంగా జత చేయాల్సి ఉంటుంది. అనంతరం చెక్‌లిస్టుపై వారు నిజంగా ఫలానా కులానికి చెందిన వారని ధ్రువీకరిస్తూ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో) సంతకం చేయాలి. ఆ తరువాత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కూడా సంతకం చేసి ఓకే చేయాలి. అనంతరం వారిచ్చిన చెక్‌లిస్టు రిపోర్టు ఆధారంగా తహసీల్దార్‌ ఒకే చేసి డిజిటల్‌ సైన్‌ చేసిన తరువాత సంబంధిత వ్యక్తికి ఆన్‌లైన్‌లో కుల ధ్రువీకరణ పత్రం మంజూరవుతోంది. ఇదంతా ఆన్‌లైన్‌ ప్రక్రియే. కానీ క్షేత్రస్థాయిలో కొందరు వీఆర్‌వోలు ఆమ్యామ్యాలకు ఆశ పడి.. ఒకే వ్యక్తికి రెండు కులాల ధ్రువీకరణ పత్రాలు, ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులకు రకరకాల కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏదేమైనా ఈ అంశంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి.. తమకు న్యాయం చేయాలని బాఽధితులు కోరుతున్నారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల వల్ల పిల్లల చదువులు, తదితర వాటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. దీనిపై జియ్యమ్మవలస తహసీల్దార్‌ ఎన్‌.అప్పారావును వివరణ కోరగా.. ‘ స్థానిక రెవెన్యూ అధికారి విచారణ చేసిన తరువాత.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన తుది నివేదిక ఆధారంగానే కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలపై ఫిర్యాదులు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. బాధితులకు న్యాయం చేస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Apr 07 , 2026 | 12:25 AM