Share News

At Lightning Speed! శరవేగంగా..

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:33 PM

At Lightning Speed! సీతంపేట సమీపంలోని పాతపనుకువలస గ్రామ పరిసరాల్లో ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) పార్క్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ఏడాది మే 13న శంకుస్థాపన చేయగా.. సుమారు 27ఎకరాల్లో రూ.7కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ఆ ప్రదేశంలో నాలుగువైపుల బీటీ రహదారులు, లైటింగ్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతానికి డ్రైన్లు, కల్వర్ట్‌ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవి పూర్తయితే ఎంఎస్‌ఎంఈ పార్క్‌ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

At Lightning Speed! శరవేగంగా..
పార్క్‌ లోపల పూర్తయిన బీటీ రహదారుల పనులు

  • సగానికిపైగా పూర్తయిన నిర్మాణాలు

  • త్వరలోనే ప్లాట్లు కేటాయింపు

సీతంపేట రూరల్‌, జూన్‌2(ఆంధ్రజ్యోతి): సీతంపేట సమీపంలోని పాతపనుకువలస గ్రామ పరిసరాల్లో ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) పార్క్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ఏడాది మే 13న శంకుస్థాపన చేయగా.. సుమారు 27ఎకరాల్లో రూ.7కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ఆ ప్రదేశంలో నాలుగువైపుల బీటీ రహదారులు, లైటింగ్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతానికి డ్రైన్లు, కల్వర్ట్‌ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవి పూర్తయితే ఎంఎస్‌ఎంఈ పార్క్‌ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆతరువాత ఆసక్తి, అర్హత కలిగిన యువతకు వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలను ప్రభుత్వం అందజేయనుంది. ఈ రుణాలతో వారికి నచ్చిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. కాగా పాతపనుకువలసలో నిర్మిస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో ఇంకా తాగునీరు, మౌలిక సౌకర్యాలతో పాటు పారిశ్రామిక స్థాపనకు అనువైన సమగ్ర సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. అంతేకాకుండా ఇక్కడ 24పారిశ్రామిక ప్లాట్లను యువత కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.

రుణాలు ఇలా ..

సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మంజూరు చేసే నిధులను బట్టీ యువతకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు సబ్సిడీ అందనుంది. టైలరింగ్‌, ఇంజనీరింగ్‌, ఫర్నీచర్‌, రెడిమేడ్‌ గార్మెంట్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ ఆపై చదువుకున్న 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులను ఎంపికచేసి వారికి అవకాశాలు కల్పించాల్సి ఉంది. అయితే ఎంఎస్‌ఎంఈ పార్క్‌ నిర్మాణ పనులు పూర్తయితే లబ్ధిదారుల ఎంపిక, రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు.

గిరిజన యువతకు ఎంతో మేలు..

యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌ సీతంపేట మన్యంలోని గిరిజన యువతకు ఎంతగానో ఉపయోగపడనుంది. సీతంపేట ఏజెన్సీలో గిరిజనులు పండించే సేంద్రియ పంటలకు మైదాన మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. అదేవిధంగా ఇక్కడ పండే ఉసిరి, సీతాఫలం, పైనాపిల్‌, పనస, కొండచీపుర్లు, చింతపండు, అల్లం, పసుపు, నిమ్మకాయలు వంటి వాటికి ప్రాసెస్‌, బ్రాండింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేస్తే గిరిజన యువతకు మంచి ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Jun 02 , 2026 | 11:33 PM