Funds Must Be Released! ఈసారైనా.. నిధులివ్వాలని!
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:19 AM
At Least This Time… Funds Must Be Released! గత ఏడాది డిసెంబరు నెల 17, 18 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ కలెక్టర్ల సమా వేశం నిర్వహించి సుమారు మూడు నెలలు గడిచినా.. ఆ పనులేవీ జరగలేదు.
జిల్లాలో ఏర్పాటు కాని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
పర్యాటక అభివృద్ధికి మంజూరు కాని నిధులు
భూసేకరణలో జాప్యం.. సాగని ఎంఎస్‌ఎంఈ పార్క్ పనులు
నేటి నుంచి జిల్లాల కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్
పార్వతీపురం, మార్చి10(ఆంధ్రజ్యోతి): గత ఏడాది డిసెంబరు నెల 17, 18 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ కలెక్టర్ల సమా వేశం నిర్వహించి సుమారు మూడు నెలలు గడిచినా.. ఆ పనులేవీ జరగలేదు. వాటికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవలేదు. కాగా నేటి నుంచి అమరావతిలో రెండు రోజుల పాటు మళ్లీ జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు , కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గత సమావేశంలో తీర్మా నించిన అంశాలపై దృష్టి సారించి.. జిల్లా ప్రగతికి చర్యలు తీసుకోవాలని మన్యం వాసులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి. ఎత్తయిన కొండలు, జలపాతాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలకు కొదవే లేదు. అందుకే ఏటా ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కూడా పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రత్యేకంగా నిధులు మంజూరు కాకపోవడంతో స్థానిక గిరిజనుల సహాయంతో పర్యాటక ప్రాంతాల వద్ద మౌలిక వసతుల కల్పనతో పాటు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ప్రకటించిన విధంగా మన్యంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసే.. పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు ప్రత్యక్షంగా.. పరోక్షంగా గిరిజనులకు ఉపాధి లభిస్తుంది.
- జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాల్సి ఉంది. ప్రధానంగా జీడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలి. మరోవైపు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. మన్యంలో పది మందికి ఉపాధినిచ్చే ఒక్క పరిశ్రమ కూడా లేదు. దీంతో జిల్లావాసులు అత్యధికంగా వలసబాట పడుతున్నారు. ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల ఏర్పాటుతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకరిస్తామన్న హామీలు అమలు కావడం లేదు. వారికి బ్యాంకు రుణాలు కూడా మంజూరు కావడం లేదు. పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు కేటాయించిన స్థలంలో నత్తనడకన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కురుపాం నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ కోసం గరుగుబిల్లి మండలంలో స్థలాన్ని ఎంపిక చేసినప్పటికీ ఇంకా నిధులు మంజూరు కాలేదు. భూసేకరణకు సుమారు రూ.మూడు కోట్లు చెల్లించాల్సి ఉంది. సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లకు స్థలం కేటాయించినా.. మౌలిక వసతలు పనులేవీ ప్రారంభించలేదు.
కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో..
గత కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించిన మేరకు.. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. డోలీ రహిత గ్రామాలుగా మార్చాలనే లక్ష్యంతో సుమారు రూ.19 కోట్లతో కొండ శిఖర ప్రాంతాల్లో రహదారుల పనులు చేపడుతున్నారు.
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు...
గత కాన్ఫరెన్స్‌లో సీఎం ఆదేశాల మేరకు జిల్లాలోని 350 సచివాలయాల ద్వారా ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించడంలో జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంది. జిల్లాలో 3,07,993 హౌస్‌హాల్డ్స్ ఉండగా 1,38,114 మందికి సేవలు అందించి రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. సచివాలయాల సిబ్బంది హాజరులోనూ జిలా ప్రథమ స్థానంలో ఉంది. 3057 మంది ఉద్యోగుల్లో 2,476 మంది సకాలంలో హాజరవుతున్నారు.