Share News

At Last! ఎట్టకేలకు!

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:10 PM

At Last! ఎట్టకేలకు సాలూరు ఐటీఐ కళాశాల వసతి సమస్యకు మోక్షం లభించింది. పట్టణానికి ఆనుకుని ఏర్పాటు చేస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌ వద్ద రెండున్నర ఎకరాలను అధికారులు కేటాయించారు. దీంతో విద్యార్థులు, సిబ్బంది, నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

At Last!  ఎట్టకేలకు!
అద్దె భవనంలో కొనసాగుతున్న సాలూరు ఐటీఐ కళాశాల

  • పరిశీలించిన అధికారులు

  • తీరనున్న వసతి సమస్య

  • ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సిబ్బంది

సాలూరు, మార్చి9(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు సాలూరు ఐటీఐ కళాశాల వసతి సమస్యకు మోక్షం లభించింది. పట్టణానికి ఆనుకుని ఏర్పాటు చేస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌ వద్ద రెండున్నర ఎకరాలను అధికారులు కేటాయించారు. దీంతో విద్యార్థులు, సిబ్బంది, నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 16 ఏళ్ల కిందట సాలూరుకు ఐటీఐ కళాశాల మంజూ రైంది. అయితే నాటి నుంచి వసతి సమస్య వేధిస్తోంది. వెంగళరాయసాగర్‌ కార్యాలయం తోపాటు, పట్టణంలోని మరో చోట అద్దె గృహంలో విద్యార్థులకు క్లాసులు, శిక్షణ నిర్వహిస్తున్నారు. గతంలో కంటే బోధన, ట్రైనింగ్‌ బాగుండడంతో ఇక్కడ చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కళాశాలలో సాలూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలో అనేక గ్రామాలకు చెందిన గిరిజన విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.

వాస్తవంగా ఈ ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి ఏడేళ్ల కిందట కేంద్రం రూ.5 కోట్ల మంజూరు చేసింది. అయితే స్థలం సమస్య కారణంగా ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో సాలూరు ఐటీఐ కళాశాల పక్క నియోజకవర్గాలకు తరలిపోతుందనే వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయాన్ని పలుమార్లు ఐటీఐ సిబ్బంది మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె ఉన్నతాధికారులో మాట్లాడి స్థల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు ఎంఎస్‌ఎంఈ పార్క్‌ వద్ద స్థల పరిశీలన చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పనులు చేపట్టాలని కోరుతున్నారు. కాగా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఉన్నతీకరణకు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.40 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో భవనం నిర్మాణం చేపట్టి సాంకేతిక విద్యకు అవసరమైన యంత్ర పరికరాలు, విద్యార్థులకు వసతిగృహం ఏర్పాటు చేసుకో వచ్చు. ప్రస్తుతం సాలూరు ఐటీఐకి అధికారులు స్ధలం కేటాయించటంతో ఆ నిధులతో ఆయా పనులు చేపట్టే అవకాశం ఉంది.

ఆనందంగా ఉంది..

సాలూరు పట్టణంలో ఉన్న ఐటీఐ కళాశాల ఇక్కడ నుంచి పక్క నియోజకవర్గాలకు తరలిపోతుందనే భయం పోయింది. కళాశాలకు స్థలం మంజూరు చేయాలని అనేకమార్లు మంత్రి సంధ్యారాణికి విన్నవించాం. ఆమె ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల చొరవతో ఐటీఐ కళాశాలకు స్థల సేకరణ పూర్తయింది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది.

- శ్రీనివాసాచారి, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ ఐటీఐ, సాలూరు

Updated Date - Mar 09 , 2026 | 11:10 PM