కొలువుదీరారు
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:01 AM
Assumed Office పురాల్లో పాలకవర్గాల పాలన మొదలైంది. సోమవారం పార్వతీపురం, సాలూరు, పాలకొండలో చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారాలు చేశారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని వారు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు
చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లకు అభినందనలు
పురాల్లో పాలకవర్గాల పాలన మొదలైంది. సోమవారం పార్వతీపురం, సాలూరు, పాలకొండలో చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారాలు చేశారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని వారు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నూతన పాలవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. మొత్తంగా అంతటా సందడి వాతావరణం నెలకొంది.
పార్వతీపురం చైర్‌పర్సన్‌గా కరుణ.. వైస్ చైర్‌పర్సన్‌గా పార్వతి
పార్వతీపురం/ పార్వతీపురం టౌన్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ప్రిసైడింగ్ అధికారి, డీఆర్వో కె.హేమలత ఆధ్వ ర్యంలో 36 వార్డులకు చెందిన పాలవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం చైర్‌పర్సన్‌గా బెలగాం కరుణ, వైస్ చైర్‌పర్సన్‌గా బీజేపీకి చెందిన ఏకైక కౌన్సిలర్ వలిరెడ్డి పార్వతి , కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్‌పర్సన్‌తో పాటు అధికార, ప్రతిపక్ష వైసీపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియలో కొంత ఉత్కంఠ నెలకొంది. చివరకు కూటమి ఒప్పందంలో భాగంగా బీజేపీ కౌన్సిలర్ పార్వతిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటున్నామని, 2వ వార్డు కౌన్సిలర్ గేదెల రామారావుకు ప్రతిపాదించారు. దీనిని 34వ వార్డు కౌన్సిలర్ పాలకొండ రాజశేఖర్ బలరపరచారు. వెంటనే ప్రిసైడింగ్ అధికారి వైస్ చైర్‌పర్సన్ నియామక పత్రాలు అందజేసి, ప్రమాణస్వీకారం చేయించారు. ఇదిలా ఉండగా.. 9, 16, 18, 24, 28, 35వ వార్డులకు చెందిన వైసీపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సమావేశం మందిరం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌లతోపాటు పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర దుశ్శాలువాతో సత్కరించారు. పట్టణ ప్రజలను దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీరు, డంపింగ్‌యార్డు తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, అందరి సహకారంతో జిల్లాకేంద్రం అభివృద్ధికి పక్కా ప్రణాళికలకు రూపొందిస్తామని చైర్‌పర్సన్ కరుణ విలేఖర్లకు తెలిపారు.
పాలకొండ చైర్‌పర్సన్‌గా విజయనిర్మల.. వైస్ చైర్‌పర్సన్‌గా దమయంతి
పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో రిటర్నింగ్ ఆఫీసర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌గా పల్లా విజయనిర్మల, 28 వార్డుల కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కొంతమంది కౌన్సిలర్లతో కమిషనర్ రాజు ప్రమాణ పత్రం చదివించారు. 11, 6వ వార్డుల కౌన్సిలర్లు పల్లా కొండలరావు, కోలా లక్ష్మి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం నగర పంచాయతీ సమావేశ మందిరంలో 26వ వార్డు టీడీఈ కౌన్సిలర్ గుమ్మడి దమయంతిను కూటమి కౌన్సిలర్లంతా ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించానని, కానీ తనకు న్యాయం చేయలేదని పదో వార్డు కౌన్సిలర్ అడపా జయ వాపోయారు. మరోవైపు వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియకు కమిషనర్ రాజు అనుమతించకపోవడంతో విలేఖర్లు కొంతసేపు నిరసన తెలిపారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యలను ఎమ్మెల్సీ గ్రీష్మ, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను నెరవేరు స్తామన్నారు. పాలకొండ రహదారి విస్తరణ పనులు, ఇంటింటికీ కుళాయిలు, డంపింగ్‌యార్డు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
సాలూరులో హైడ్రామా
సాలూరు: సాలూరు మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గాలు కొలువుదీరిన వేళ హైడ్రామా కొనసాగింది. వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఎన్నికల అధికారి సచిన్ రహర్ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ గొర్లె విజయకుమారి, 32 వార్డుల కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం అనూహ్య పరిణామాల మధ్య మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యూహాత్మక ఎత్తుగడలతో టీడీపీ బలపరిచిన అభ్యర్థి రెండో వార్డు కౌన్సిలర్ పప్పల మోహన్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తొలుత మంత్రి సంధ్యారాణి... వైస్ చైర్మన్‌గా 2వ వార్డు కౌన్సిలర్ మోహన్‌కు సంబంధించిన బీఫాంను ఎన్నికల అధికారికి ఇచ్చారు. వైసీపీ నుంచి వైస్ చైర్మన్‌గా ఎవరు పోటీలో నిలవడం లేదని 30వ వార్డు కౌన్సిలర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. అయితే జనసేన వైస్ చైర్మన్ అభ్యర్థిగా 13వ వార్డు కౌన్సిలర్ గేదెల లావణ్యను ప్రతిపాదిస్తున్నట్టు 15వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ పెద్దింటి శ్రీరాములు ప్రతిపాదించారు. పదో వార్డు జనసేన కౌన్సిలర్ మీసాల సతీష్‌కుమార్ దానిని బలపరిచారు. అయితే ఆమెకు అనుకూలంగా ఆ పార్టీ నుంచి నలుగురు కౌన్సిలర్లు, వైసీపీ నుంచి 9 మంది , ఒక స్వతంత్ర కౌన్సిలర్, మున్సిపల్ చైర్‌పర్సన్ గొర్లె విజయకుమారితో కలిపి 15 మంది చేతులెత్తారు. 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పువ్వల పైడితల్లి భరత్ శ్రీనివాస్ ఎవరికీ మద్దతు తెలపలేదు. టీడీపీ, బీజేపీ, స్వతంత్ర , ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు, మంత్రి సంధ్యారాణితో కలిపి మొత్తంగా 18 మంది చేతులెత్తి మద్దతు తెలపడంతో పప్పలమోహన్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. కూటమి ఒప్పందానికి విరుద్ధంగా జనసేన నాయకులు వైసీపీతో కలిసిపోయినా .. చివరకు టీడీపీ విజయం సాధించిందన్నారు. కాగా మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో.. 11 టీడీపీ, 4 జనసేన, బీజేపీ-1, స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థులు మూడు వార్డుల్లో గెలుపొందగా.. వైసీపీ అభ్యర్థులు 13 వార్డులకు పరిమితమైన విషయం తెలిసిందే.