ఆస్తులు సరే.. ఆదాయం ఏదీ?
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:56 AM
విజయనగరం నగరపాలక సంస్థకు విలువైన ఆస్తులు ఉన్నాయి. అన్నింటికీ మించి షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి.
షాపులు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నుంచి కార్పొరేషన్‌కు కానరాని ఆదాయం
367 దుకాణాల్లో వినియోగంలో ఉన్నవి 289 మాత్రమే
డిమాండ్‌కు తగ్గట్టు లేని అద్దె
దాసన్నపేట, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): విజయనగరం నగరపాలక సంస్థకు విలువైన ఆస్తులు ఉన్నాయి. అన్నింటికీ మించి షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వాటి నుంచి ఆదాయం గణనీయంగా రావాలి. కానీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా అనుకున్న స్థాయిలో ఆదాయం లేదు. దీనిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న షాపుల స్థానంలో కొత్తవాటి నిర్మాణం చేపట్టడం లేదు. ఉన్న వాటి నిర్వహణపై నగరపాలక సంస్థ దృష్టిపెట్టకపోవడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరపాలక సంస్థకు సంబంధించి మొత్తం 367 దుకాణాలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కేవలం 289 మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. 78 షాపులు నిరుపయోగంగా మిగిలాయి. నిర్వహణలో ఉన్న దుకాణాల నుంచి అద్దె రూపంలో డిమాండ్‌కు తగ్గట్టు చూస్తే రూ.3 కోట్ల వరకూ ఆదాయం సమకూరాలి. కానీ రూ.1.80 కోట్లకు మించి రావడం లేదు. అంటే దాదాపు సగం ఆదాయం మాత్రమే సమకూరుతోంది. అద్దె వసూలు, నిర్ధారణ, షాపుల కేటాయింపు, లీజు వ్యవహారాలు అడ్డగోలుగా నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2009కు ముందు మునిసిపాల్టీ కార్యాలయం పాత షాపింగ్ కాంప్లెక్స్‌లోనే ఉండేది. అటు తరువాత కొత్తగా కట్టిన భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి పాత భవనాన్ని వృథాగా విడిచిపెట్టారు. 16 భారీ గదులు, రెండు అద్దె గదులు ఖాళీగా ఉండిపోయాయి. వీటిని వినియోగంలోకి తెచ్చి లీజుకు ఇస్తే నగరపాలక సంస్థకు మంచి ఆదాయం చేకూరుతుంది. కానీ ఎందుకో ఆ పనిచేయడం లేదు.
ఏడాది కిందట కూల్చివేత..
స్థానిక ఎంజీ రోడ్డులోని విపణికల్పా షాపింగ్ కాంప్లెక్స్ కూడా నగరపాలక సంస్థకు చెందినదే. కానీ శిథిలావస్థకు చేరడంతో ఏడాది కిందట కూల్చేశారు. ఇప్పటికీ కొత్త నిర్మాణం ఊసేలేదు. ఈ ప్రాంతంలో చిన్న దుకాణం అద్దె రూ.30 వేల వరకూ ఉండగా.. పెద్ద దుకాణాలకు రూ.1.50 లక్షల వరకూ అద్దె వసూలు చేస్తున్నారు. అటువంటి ఖరీదైన ప్రాంతంలో దుకాణాలు త్వరితగతిన నిర్మించి అద్దెకు ఇస్తే నగరపాలక సంస్థకు భారీ ఆదాయం సమకూరుతుంది. కానీ ఏళ్ల తరబడి ఆదాయానికి గండిపడుతోంది. అటు నిర్మాణాలు చేయడం లేదు. ఉన్నవాటిని సరిగ్గా నిర్వహించడం లేదు. ఆపై అద్దెలు, లీజుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ యంత్రాంగం షాపులు, షాపింగ్ కాంప్లెక్స్‌లపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
దృష్టిపెడతాం
కార్పొరేషన్ పరిధిలో షాపులు, షాపింగ్ కాంప్లెక్స్‌లపై దృష్టిపెడతాం. ఎప్పటికప్పుడు వేలం నిర్వహించి అప్పగిస్తున్నాం. పాత వాటికి మరమ్మతులు చేపడతాం. విపణికల్పా షాపింగ్ కాంప్లెక్స్‌లో కొత్త దుకాణాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.
- బాలస్వామి, నగరపాలక సంస్థ కమిషనర్, విజయనగరం