Term Comes to an End! పదవీ కాలం ముగుస్తోందని!
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:37 AM
As the Term Comes to an End! పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. 3వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానుంది. అయితే మరో వారం రోజుల్లో పదవీకాలం ముగుస్తుండడంతో పలువురు సర్పంచ్‌లు అభివృద్ధి పనుల కోసం ఆరాట పడుతున్నారు. ఆఖరి సమయంలో పలు నిర్మాణాలు చేపడుతూ.. హడావుడి చేస్తున్నారు.
పంచాయతీల్లో నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి పనులు
సర్వత్రా విమర్శల వెల్లువ
నిధుల వ్యయంపై పంచాయతీరాజ్ కమిషనర్ దృష్టి
చెల్లింపులకు మార్గదర్శకాలు జారీ
గరుగుబిల్లి, మార్చి27(ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. 3వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానుంది. అయితే మరో వారం రోజుల్లో పదవీకాలం ముగుస్తుండడంతో పలువురు సర్పంచ్‌లు అభివృద్ధి పనుల కోసం ఆరాట పడుతున్నారు. ఆఖరి సమయంలో పలు నిర్మాణాలు చేపడుతూ.. హడావుడి చేస్తున్నారు. కాగా గత ఐదేళ్ల కాలంలో గుర్తుకు రాని పనులు ఈ వారం రోజుల్లోనే గుర్తుకొచ్చాయా? అని పలువురు విమర్శిస్తున్నారు.
అమలు కాని నిబంధనలు
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 451 పంచాయతీలు ఉన్నాయి. కాగా పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులు నిర్వహించాలంటే ముందుగా జీపీడీపీ యాక్షన్ ప్లాన్‌లో పొందు పర్చాలి. ప్లాన్‌లో ఉన్న మేరకు పనులు నిర్వహించాల్సి ఉంది. అయితే పంచాయతీల్లో ఈ పరిస్థితి కనిపించడం లేదు. సర్పంచ్ చెప్పడమే ఆలస్యం.. కార్యదర్శులు అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పంచాయతీల పరిధిలో 15వ ఆర్థిక సంఘంతో పాటు జనరల్ ఫండ్ నిధులు ఉన్నాయి. ‘పదవి నుంచి దిగిపోయే ముందు ప్రజలకు సేవ చేస్తున్నాం’ అన్న ప్రచారం కోసం కొందరు వైసీపీ సర్పంచ్‌లు పలు రకాల పనులు నిర్వహిస్తున్నారు.
చెల్లింపులపై మార్గదర్శకాలు
గతంలో సర్పంచ్‌ల పదవీకాలానికి రెండు, మూడు నెలల ముందే వారు నిధులు డ్రా చేయకుండా చర్యలు చేపట్టేవారు. ఆ సమయంలో చెక్ బుక్కులను స్వాధీనం చేసుకుని, అభి వృద్ధి పనులకు అవసరమైన మొత్తాలను సీఎఫ్‌ఎంఎస్ విధానాన్ని అమలుపర్చేవారు. ప్రస్తుతం ఈ నిబంధనలు విధించలేదు. అయితే ఇప్పటికే పంచాయతీల పరిధిలో నిధుల వ్యయంపై రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సర్పంచ్‌లు చెల్లింపులు చేసే అవకాశాన్ని నిలుపుదల చేశారు. అత్యవసర చెల్లింపులకు సంబంధిత డివిజినల్ డెవలప్‌మెంట్ అధికారికి అనుమతులు ఇచ్చారు. పంచాయతీల పరిధిలోని లాగిన్‌ను మార్పు చేశారు. ప్రస్తుతం ట్రెజరీలకు కాకుండా డీడీవో లాగిన్‌కు వెళ్లేలా చర్యలు చేపట్టారు. సంబంధిత పంచాయతీల్లో నిర్వహించిన ఖర్చులను పూర్తిస్థాయిలో పరిశీలించి డీడీవో ఆమోదం తెలపాల్సి ఉంది. పంచాయతీల కార్యదర్శులు, సర్పంచ్‌లు కుమ్మక్కై నిధులు డ్రా చేసేందుకు వీలులేకుండా నిబంధనలను మార్పు చేశారు.
ప్రత్యేకాధికారుల నియామకానికి చర్యలు
జిల్లా పరిధిలోని 451 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి చర్యలు చేపడు తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. గెజిటెడ్ అధికారుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా తహసీల్దార్, ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, ఎంఈవోలు, మండల వ్యవసాయాధికారులు, ఉద్యాన శాఖ, పశు వైద్యాధికారులు, మండల పరిషత్ కార్యాలయ ఏవోలను నియమించనున్నారు. కాగా ఎంబుక్‌లతో పాటు చెక్ మెజర్‌మెంట్‌లో అవకతవలకు అవకాశం లేకుండా ఇంజనీరింగ్ అధికారులను ప్రత్యేకాధికారుల నియామకానికి దూరంగా పెట్టారు.
చర్యలు తప్పవు
ఆఖరు సమయంలో పంచాయతీల్లో చేపడుతున్న పనులపై ఫిర్యాదులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. నిధులు పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవు. పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబంధించి చెల్లింపులపై నిబంధనలు విధించారు. ఈ నేపథ్యంలో డీడీవో పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే చెల్లింపులు జరుగుతాయి. పంచాయతీల పరిధిలో చేయని పనులను ఎంబుక్‌లో నమోదు చేసి, చెక్ మెజర్‌మెంట్ చేస్తే పంచాయతీ కార్యదర్శులే బాధ్యు లవుతారు. ప్రత్యేకాధికారుల నియామకంపై పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ నెల 31లోగా పంచాయతీలవారీగా జాబితాలను కలెక్టర్‌కు అందించనున్నాం. గెజిటెడ్ ర్యాంకు ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటుంది.
- ఎం.నాగభూషణరావు, డివిజనల్ పంచాయతీ అధికారి, పార్వతీపురం