Share News

తవ్వినోడికి తవ్వినంత

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:26 PM

జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది జామి. మండల కేంద్రం కావడం, జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండడంతో ఇక్కడ భూముల ధరలు కూడా ఎక్కువే.

తవ్వినోడికి తవ్వినంత
జామి గ్రామం సర్వే నెంబర్‌ 394లో ఉన్న మాధవరాయమెట్టపై జరుగుతున్న అక్రమ తవ్వకాలు

- జామి మాధవరాయ మెట్టపై ఇష్టారాజ్యంగా మైనింగ్‌

- గడువు ముగిసినా కొనసాగుతున్న తవ్వకాలు

- ప్రభుత్వ ఆదాయానికి గండి

- అటువైపు చూడని అధికారులు

విజయనగరం/జామి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది జామి. మండల కేంద్రం కావడం, జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండడంతో ఇక్కడ భూముల ధరలు కూడా ఎక్కువే. మరోవైపు గృహ నిర్మాణాలు శరవేగంగా జరుగుతుండడంతో మట్టి, గ్రావెల్‌కు కూడా విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో జామిలోని మాధవరాయమెట్టపై అక్రమార్కుల కన్నుపడింది. అధికారిక అనుమతులు తీసుకున్నామని కొందరు, మాకెంటి అడ్డు అని మరికొందరు మెట్టను తవ్వేస్తున్నారు. తవ్వినోడికి తవ్వినంత అన్నట్లు పెద్ద ఎత్తున మట్టి, గ్రావెల్‌, కంకరను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ పరిస్థితి..

మాధవరాయమెట్ట దాదాపు 38.37 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. సర్వేనెంబర్‌ 394/1,2,3లో ఒక హెక్టారులో మూడేళ్ల పాటు మైనింగ్‌ చేసుకునేందుకు గతంలో చిప్పాడ అప్పారావు అనే వ్యక్తి అనుమతి తీసుకున్నారు. అయితే, ఈ గడువు ముగిసినా మైనింగ్‌ తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. అప్పారావు చనిపోయినా ఆయన పేరుతోనే కొంతమంది మైనింగ్‌ చేస్తున్నారు. అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా తవ్వేసి మెట్టను గుల్ల చేస్తున్నారు. తవ్వకాల కోసం నిషేధిత పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. జిలిటెన్‌ స్టిక్స్‌ తెచ్చి కొండపై భారీగా బ్లాస్టింగ్స్‌ చేస్తున్నారు. దీంతో క్వారీకి సమీపంలో మేతకు వచ్చే మూగజీవాలపై రాళ్లుపడి మృత్యువాత పడుతున్నాయి. సమీప నివాసితులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తవ్వకాలతో మెట్టపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఆ గోతుల్లో నీరు చేరడంతో పిల్లలు ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న పలు క్వారీలు, క్రషర్లు కూడా గడువు కాలం ముగిసినా రెన్యువల్‌ చేసుకోవడం లేదు. అనుమతులు లేకుండా క్వారీయింగ్‌ చేయడం వల్ల క్రషర్లు, క్వారీల యాజమాన్యాలకు పెద్దఎత్తున లాభం కలుగుతుండగా ప్రభుత్వ ఖజానాకు మాత్రం గండిపడుతుంది.

- జొన్నాడ టోల్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ క్వారీని కూడా అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాత్రుళ్లు బ్లాస్టింగ్‌ చేస్తుండడంతో రహదారిపైకి రాళ్లు వచ్చిపడుతున్నాయి. వ్యవసాయ భూముల్లో సైతం రాళ్లు పడుతుండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. అక్రమ మైనింగ్‌ జరుగుతుందని రైతులు, గ్రామస్థులు ఇటీవల అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయితే, రాజకీయ ఒత్తిడితో ఆ ట్రాక్టర్లను సాయంత్రానికే విడిచిపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మైన్స్‌, రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 11:26 PM