As if the pond belonged to them... చెరువు వారిదన్నట్టు..
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:21 AM
As if the pond belonged to them... పురిటిపెంట వంక చెరువులో కొద్దిరోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. చెరువు వారిదే అనుకున్నారేమో! నచ్చినట్లుగా ధ్వంసం చేస్తున్నారు. ట్రాక్టర్లకు ట్రాక్టర్లే మట్టిని ఎత్తుకుపోతున్నారు. రోజూ వారిని చూస్తున్న స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
చెరువు వారిదన్నట్టు..
పురిటిపెంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు
గజపతినగరం, జూలై15(ఆంధ్రజ్యోతి): పురిటిపెంట వంక చెరువులో కొద్దిరోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. చెరువు వారిదే అనుకున్నారేమో! నచ్చినట్లుగా ధ్వంసం చేస్తున్నారు. ట్రాక్టర్లకు ట్రాక్టర్లే మట్టిని ఎత్తుకుపోతున్నారు. రోజూ వారిని చూస్తున్న స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సరికాదు అని చెప్పినా వారు వినడం లేదు. ఎలాగైనా అడ్డుకోవాలని భావించి బుధవారం 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు చెరువు వద్దకు వెళ్లి మట్టి తవ్వకాలను నిలిపివేయడంతో పాటు వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెవెన్యూ అధికారులకు సమాచారం తెలియడంతో తహసీల్దార్ కె.భరత్‌కుమార్ ఆదేశాల మేరకు పురిటిపెంట గ్రామ సచివాలయాల రెవెన్యూ అధికారులు చెరువు వద్దకు వెళ్లి అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయించారు. ఇరిగేషన్‌తో పాటు మైనింగ్ అధికారులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు.
కాగా మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అనుమతులు లేకుండా రాత్రీపగలు తేడా లేకుండా ఇష్టానుసారంగా తవ్వేసి మట్టిని దోపిడీ చేస్తున్నారు. పురిటిపెంట, జన్నాం, మరుపల్లి తదితర గ్రామాల్లో రాత్రి సమయాల్లో ఎక్కడికక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో అనధికార లేవుట్లు, పల్లపు ప్రాంతాలకు మట్టిని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చెరువుల కింద ఉండే ఆయకట్టుదారులు మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం ఉండడం లేదు.