Share News

కష్టకాలంలో నేనున్నానంటూ!

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:40 PM

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది.

   కష్టకాలంలో నేనున్నానంటూ!
పార్వతీపురంలోని అన్న క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న ప్రజలు

- పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు

- గ్యాస్‌ కొరతతో మూతపడిన హోటళ్లు

- అన్న క్యాంటీన్లను ఆశ్రయిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలు

- రూ.5కే కడుపునిండా భోజనం పెడుతున్న వైనం

బెలగాం/పాలకొండ, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో జిల్లాలో చాలా హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు మూతపడ్డాయి. కొందరు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ హోటళ్ల నిర్వహణ సాగిస్తున్నారు. మరికొందరు పాతపద్ధతిలో ఊకపొయ్యిలను వాడుతున్నారు. ఇంకొంతమంది ఎక్కువ ధరకు బ్లాక్‌లో సిలిండర్లు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. మరోపక్క వంట నూనెల ధరలు మండుతున్నాయి. దీంతో టిఫిన్‌, భోజనం ధరలను పెంచేయడంతో కార్మికులు, విద్యార్థులు, పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో వీరంతా అన్న క్యాంటీన్లను ఆశ్రయిస్తున్నారు. వీరి ఆకలిని అన్న క్యాంటీన్లు తీరుస్తున్నాయి. రూ.5కే కడుపునిండా టిఫిన్‌, భోజనం పెడుతున్నాయి. ప్రస్తుతం చాలా వరకూ హోటళ్లు మూతపడడంతో వివిధ పనుల నిమిత్తం జిల్లా, మండల కేంద్రాలకు వచ్చే ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, రోగులు, చిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు ఉదయం అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి అన్న క్యాంటీన్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో అవి రద్దీగా మారుతున్నాయి. జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో ప్రతిరోజూ 300 మంది టిఫిన్‌, 800 మంది భోజనం చేస్తున్నారు. పాలకొండలోని అన్న క్యాంటీన్‌లో ప్రతిరోజూ సుమారు 500 మంది వరకు టిఫిన్‌, భోజనం చేసేవారు. ప్రస్తుతం వీరి సంఖ్య 550కు చేరింది. రద్దీకి తగ్గట్టుగానే ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా, క్యూలైన్లలో ఉన్న ప్రతి ఒక్కరికీ భోజనం అందేలా నిర్వాహకులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.

రూ.5కే రుచికరమైన భోజనం

పని మీద పార్వతీపురానికి వచ్చాను. బయట హోటల్‌లో భోజనం చేయాలంటే రూ.100 అవుతుంది. అన్న క్యాంటీన్‌లో రూ.5కే రుచి కరమైన భోజనం పెడుతున్నారు. అందువల్ల ఇక్కడకు వచ్చాను. ఇంతకుముందుతో పోలిస్తే రద్దీ ఎక్కువుగా ఉంది. ఎందుకంటే అతి తక్కువ ధరకు ఇంత రుచికరమైన ఆహారం బయట కూడా దొరకడం లేదు. గ్యాస్‌ కొరతతో హోటళ్లు మూసి వేసినా, అన్న క్యాంటీన్‌లో తక్కువ ధరకు భోజనం అందించడం సంతోషకరం.

- పి.శ్రీవాణమ్మ, సీతానగరం, పార్వతీపురం మండలం

======

హోటల్‌ మూసి వేసి ఉంది

నేను ఆసుపత్రి పని మీద వచ్చాను. మధ్యాహ్నం అయిపోయింది ఆకలి వేస్తోందని ఒక హోటల్‌కు వెళ్లగా మూసి వేసి ఉంది. ఇంకొక్క దగ్గరకు వెళ్లాను. అక్కడ భోజనం ధర ఎక్కువుగా ఉంది. అంత ధర వెచ్చించలేక అన్న క్యాంటీన్‌కు వచ్చి భోజనం చేశాను. ఎంతో రుచికరమైన భోజనం ఇక్కడ లభిస్తుండడం చాలా ఆనందంగా ఉంది.

- కురిమినాయుడు, కుందల తిరువాడ, జియ్యమ్మవలస మండలం

==========

ప్రతిరోజూ ఇక్కడే భోజనం చేస్తా

నేను పండ్ల వ్యాపారం చేస్తుంటాను. నిత్యం వ్యాపారం నిమిత్తం పార్వతీపురం పట్టణానికి వస్తుంటాను. రోజూ అన్న క్యాంటీన్‌లో భోజనం చేస్తాను. గ్యాస్‌ కొరత ఏర్పడినప్పటి నుంచి అన్న క్యాంటీన్‌లో రద్దీ పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్‌ కొరతతో కొన్ని హోటళ్లు మూసివేస్తున్నా.. అన్న క్యాంటీన్‌లో ప్రతి రోజూ నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. నాలాంటి చిరు వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మాలాంటి వారికి, పేదలకు అన్న క్యాంటీన్‌ కడుపునింపుతుంది.

- తుమ్మి శంకరరావు, రేగిడి, విజయనగరం జిల్లా

=========

ఆకలి తీరుస్తోంది..

అన్న క్యాంటీన్‌ నాలాంటి పేదల ఆకలి తీరుస్తోంది. ఏదైనా అవసరం మేరకు పాలకొండ పట్టణం వస్తే అన్న క్యాంటీన్‌లో భోజనం చేస్తాను. కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం పెడుతున్నారు.

సన్యాసిరావు, డొంకలపర్త, పాలకొండ

==============

ఆహారం రుచిగా ఉంది

బయట భోజన హోటళ్లలో వంద రూపాయలు పెట్టి తిందామన్నా భోజనం సరిగా ఉండడం లేదు. కేవలం ఐదు రూపాయలతోనే అన్న క్యాంటిన్‌లో రుచికరమైన భోజనం పెడుతున్నారు. ఉదయం పెడుతున్న టిఫిన్‌ కూడా బాగుంటుంది. పేదలి ఆకలి తీరుస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

- అప్పలనర్సమ్మ, అంపిలి, పాలకొండ

Updated Date - Apr 02 , 2026 | 11:40 PM