Artificial shortage of dieselడీజిల్‌కు కృత్రిమ కొరత
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:35 AM
Artificial shortage of diesel పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పటివరకు హోటల్ రంగంపైనా ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్లపైనా ప్రత్యక్షంగా పడిందనుకుంటే తాజాగా ఆ కోవలో పెట్రో ఉత్పత్తులు చేరాయి. పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు క్రమంగా నిండుకుంటున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారే సంకేతాలు కన్పిస్తున్నాయి.
డీజిల్‌కు కృత్రిమ కొరత
పరిశ్రమ వర్గాలతో బంకుల యాజమానుల అవగాహన
లీటరుపై రూ.10 నుంచి 15 ఇచ్చేందుకు ఒప్పందం
సరఫరాలో 50 శాతం అటువైపు మళ్లింపు
రోజువారీ వినియోగదారులకు అవస్థలు
అప్రమత్తమైన రిఫైనరీల అధికారులు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పటివరకు హోటల్ రంగంపైనా ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్లపైనా ప్రత్యక్షంగా పడిందనుకుంటే తాజాగా ఆ కోవలో పెట్రో ఉత్పత్తులు చేరాయి. పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు క్రమంగా నిండుకుంటున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారే సంకేతాలు కన్పిస్తున్నాయి. పరిశ్రమ వర్గాలతో బంకుల యాజమానులు గుట్టుగా ఒప్పందం చేసుకున్నారని, దీంతో సరఫరాలో 50 శాతం అటువైపు మళ్లిస్తున్నారని తెలుస్తోంది. ఇది కొనసాగితే రోజువారీ వినియోగదారులకు నరకమే. రవాణా వ్యవస్థపైనా పెను ప్రభావం పడే ప్రమాదం ఉంది.
విజయనగరం క్రైం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో దాదాపు 50 పెట్రోల్ బంకులున్నాయి. ప్రతి రోజూ 30 నుంచి 40వేల లీటర్ల పెట్రోలు, 50 నుంచి 60వేల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతున్నట్టు అంచనా. పరిశ్రమ, పబ్లిక్, ప్రైవేటు రవాణా రంగాల వినియోగానికి ఇది అదనం. యుద్ధం తారస్థాయికి చేరిన పరిస్థితుల్లో కూడా జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత కన్పించలేదు. వ్యక్తిగత వ్యాపార వాహన యాజమానులు నిశ్చింతగా ఉండేవారు కాకపోతే, అక్కడక్కడ కొంత మంది అనవసర ఆందోళనతో బంకుల వద్ద క్యూలు కట్టేవారు. తాజా పరిస్థితులు మాత్రం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెట్రోలు బంకుల్లో డీజిల్ కొరత క్రమేణా నెలకొంటున్నది. డీజిల్ కార్లు, ట్రాక్టర్లు, లారీలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. నిజానికి జిల్లాలో డిమాండ్‌కు సరిపడా సరఫరా జరుగుతోంది. అయితే పరిశ్రమలు, ప్రైవేటు రవాణా వ్యవస్థలతో బంకుల యాజమానుల అవగాహనకు రావడంతో కృత్రిమ కొరతకు దారితీస్తోంది.
కొరత ఇలా
పరిశ్రమలు, ప్రైవేటు రవాణా సంస్థలు నేరుగా రిఫైనరీ సంస్థల నుంచి బల్క్‌గా కొనుగొలు చేస్తుంటాయి. వీటికి రిటైల్ పంపిణీ ఖర్చులు, డీలర్ల కమీష:న్ వంటివి వుండనందున సాధారణంగా రిటైల్ ధరలు కంటే తక్కువగా ఉంటాయి. అయితే యుద్ధప్రభావం వల్ల పారిశ్రామిక డీజిల్ ధరలు వున్నట్టుండి లీటరుకు రూ.20 నుంచి 25కు పెరగడంతో పాటు సరఫరాలో కోత ఉన్నందున పారిశ్రామిక వర్గాల చూపు పెట్రోలు బంకులవైపు మళ్లింది. వారి పారిశ్రామిక అవసరాలకు సరిపడా డీజిల్ కోసం బంకులనే ఆశ్రయించడంతో బంకులకు రెగ్యులర్‌గా సరఫరా అయ్యే డీజిల్‌లో సింహభాగం అటువైపు మళ్లిస్తున్నారు. బంకుల్లో డీజిల్ ట్యాంకులు అండుగంటిపోయి కృత్రిమ కొరత నెలకొంటోంది.
పరిశ్రమ వర్గాలతో అవగాహన
యుద్ధం కారణంగా పారిశ్రామిక రంగానికి డీజిల్ సరఫరాలో కోత పెట్టడంతో పాటు రిఫైనరీలో రేటు పెంచడంతో పరిశ్రమ వర్గాలు పెట్రోలు బంకుల యాజమానులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. లీటరుకు రూ.10 నుంచి 15 వరకూ అదనంగా చెల్లించే విధంగా అవగాహనకు వచ్చారు. దీంతో డీజిల్‌లో 50 శాతం వరకూ పరిశ్రమ వర్గాలు ఎగరేసుకు పోతున్నాయి. రోజువారీ అవసరాలకు డీజిల్ దొరకక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఉన్నదాంట్లో సర్దుబాటు చేస్తూ వినియోగదారులను పెట్రోలు బంకుల యాజమానులు సంతృప్తి పరుస్తున్నారు.
ఇలా బయటపడింది
వెలుతురు ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కొందరు బంకు నిర్వాహకులు పారిశ్రామిక రంగాలతో కమీషన్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. అందుకు గత నెల మార్చి అమ్మకాలే ఉదాహరణ. గత నెలలో సుమారు 40 నుంచి 50 శాతం డీజిల్ అమ్మకాలు పెరిగాయి. బంకులకు సరఫరా విషయంలో కొరత లేనప్పటికీ, డీజిల్ కొరత ఎందుకు వస్తున్నదని రిఫైనరీ సేల్స్ మేనేజర్లు కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. దీంతో వారు అప్రమత్తమై, డీజిల్ కార్లు, వ్యవసాయ ట్రాక్టర్లు, రోజువారీ అవసరాలకు మాత్రమే డీజిల్ అమ్మకాలు జరగాలని పరిశ్రమ వర్గాలకు బల్క్ విక్రయాలు ఆపాలని నిర్వహకులకు సేల్స్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్‌లో ఆదేశాలు పంపించారు. ఇది వరకూ ప్రతి నెలా ఎంత మేర సేల్ అయ్యేదో? ఆ మేరకే బంకులకు డీజిల్ సరఫరా చేస్తున్నారు. అదనంగా డీజిల్ కావాలని కోరినా ఇవ్వడం లేదని బంకు యాజమానులు అంటున్నారు. అంతేకాకుండా తమకు ఇవ్వాల్సిన కోటాలో కూడా కోత విధిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే వ్యవసాయం, రోడ్ల నిర్మాణం, గృహనిర్మాణం ఇత రత్రా పనులు వేసవిలో చురుగ్గా జరగడం వల్ల సహజంగానే డీజిల్ అమ్మకాలు గణనీయంగా పెరగడం పరిపాటిగా వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఆదేశాలను, సూచనలను బంకుల యాజమానులు ఎంత వరకూ పాటిస్తారన్నది ఆసక్తిగా మారింది. కొద్ది రోజులుగా డీజిల్ కృత్రిమ కొరత కారణంగా ఇబ్బంది పడుతున్న రైతులు, డీజిల్ వాహనాల యాజమానులు అసలు విషయం తెలియక, ఇదంతా యుద్ధ ప్రభావమని సమాధాన పరుచుకుంటున్నారు. ఇదిలా వుంటే గ్యాస్ ఇబ్బందులు ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్నాయి,. యుద్ధం అరంభం అయిన మొదట్లో వున్న గ్యాస్ కొరత క్రమంగా సర్దుకున్నప్పటికీ సాధారణ పరిస్థితులు మాత్రం నెలకొనలేదు. ఇదే అదనుగా హోటల్ యజమానులు రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేశారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, ఫుట్‌పాత్‌పై టిఫిన్ బళ్లు మూతపడ్డాయి. యుద్ధంతో సంబంధం లేని వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి. మందుల ధరలపై కూడా ప్రభావం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ విరమణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
పారిశ్రామిక రంగాలకు సరఫరా ఆపాం
ప్రతాప్‌రెడ్డి, ఇండియన్ అయిల్ కార్పొరేషన్, ఉత్తరాంధ్ర డివిజనల్ సేల్స్ ఆఫీసర్
డీజిల్, పెట్రోల్‌కు ప్రస్తుతానికి కొరత లేదు. సాధారణ రోజుల్లో సరఫరా చేసినట్టు ప్రస్తుతం బంకులకు సరఫరా చేస్తున్నాం. గత నెలలో 40 నుంచి 50 శాతం డీజిల్ అమ్మకాలు పెరిగాయి. ఎందుకని ఆరా తీయగా పారిశ్రామిక రంగాలకు డీజిల్ మళ్లుతోందని తెలిసింది. రెగ్యులర్ వినియోగదారులు, ప్రజలు, రైతులు, చిరువ్యాపారులు ఇబ్బంది పడకూడదని బల్క్‌లో డీజిల్ ట్యాంకర్లకు ఇవ్వవద్దని చెప్పాం. రెగ్యులర్ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
===============