Share News

24న వస్తున్నాయ్‌!

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:39 PM

కుంకీ ఏనుగుల రాకకు ముహూర్తం ఖరారైంది. కర్ణాటక నుంచి రాష్ర్టానికి తీసుకొచ్చిన కుంకీల్లో రెండింటిని ఈనెల 24న జిల్లాకు పంపిస్తున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. 22న అవి చిత్తూరులోని ప్రత్యే వాహనాల్లో బయల్దేరి మన్యంకు రానున్నట్లు వెల్లడించారు.

24న వస్తున్నాయ్‌!

పార్వతీపురం, జూలై19(ఆంధ్రజ్యోతి): కుంకీ ఏనుగుల రాకకు ముహూర్తం ఖరారైంది. కర్ణాటక నుంచి రాష్ర్టానికి తీసుకొచ్చిన కుంకీల్లో రెండింటిని ఈనెల 24న జిల్లాకు పంపిస్తున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. 22న అవి చిత్తూరులోని ప్రత్యే వాహనాల్లో బయల్దేరి మన్యంకు రానున్నట్లు వెల్లడించారు. కాగా వాటి రాకతో.. దశాబ్దాలుగా వేధిస్తున్న గజరాజుల సమస్యకు తెరపడనుందని మన్యం వాసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం డివిజన్‌లో ఎనిమిది ఏనుగులు, పాలకొండ డివిజన్‌లో నాలుగు గజరాజులు సంచరిస్తున్నాయి. వాటి కారణంగా దశాబ్దాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ఆస్తి, పంట, ప్రాణ నష్టాలను చవిచూస్తున్నారు. అటవీ ఏనుగుల దాడిలో జిల్లాలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు. కాగా మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున 2017 నుంచి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిహారాన్ని రూ.పది లక్షలకు పెంచింది. ఏనుగుల కారణంగా 2017 నుంచి ఇప్పటివరకు మన్యంలో సుమారు 3,811 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు నష్టపోయారు. అయితే వారికి రూ.2.79 కోట్ల వరకు పరిహారంగా అందించారు. అయితే కుంకీల రాకతో జిల్లావాసుల కష్టాలు తొలగనున్నాయి. వాటి సాయంతో తొలుత పార్వతీపురం డివిజన్‌లో సంచరించే ఎనిమిది ఏనుగులను సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్‌ జోన్‌కు తరలించే అవకాశం ఉంది.

జిల్లావాసులను దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఏనుగుల సమస్యను జిల్లా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ కుంకీల రాకకు చొరవ చూపారు. అంతే గాకుండా ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటుకు భారీగా నిధులు మంజూరు చేశారు. కాగా ఈనెలలోనే మన్యంకు కుంకీలు వస్తుండడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఈ వారంలోనే రాక..

ఈ వారంలో జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు రానున్నాయి. 22న అవి ప్రత్యేక వాహనాల్లో చిత్తూరు జిల్లాలో బయలుదేరుతాయి. ఈనెల 23 లేదా 24వ తేదీకి జిల్లాకు కుంకీ ఏనుగులు వస్తాయి.

- మణికంఠేశ్‌, రేంజర్‌, ఏనుగుల పర్యవేక్షణ విభాగం

Updated Date - Jul 20 , 2026 | 07:49 AM