చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్టు
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:26 AM
ఈనెల 9న విశాఖపట్నం జిల్లా చిట్టివలస సప్తగిరి థియేటర్ రోడ్డులో చింతపల్లి సత్యవతి(80) అనే వృద్ధురాలి మెడలో బంగారు పుస్తెలతాడు తెంపిన ఘటనలో విజయనగరానికి చెందిన ప్రధాన నిందితుడు గ్రంధి రాజేష్(36)ను భీమిలి క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేసి, మూడు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనపర్చుకున్నారు.
చోరీ సొత్తు స్వాధీనం
భీమునిపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఈనెల 9న విశాఖపట్నం జిల్లా చిట్టివలస సప్తగిరి థియేటర్ రోడ్డులో చింతపల్లి సత్యవతి(80) అనే వృద్ధురాలి మెడలో బంగారు పుస్తెలతాడు తెంపిన ఘటనలో విజయనగరానికి చెందిన ప్రధాన నిందితుడు గ్రంధి రాజేష్(36)ను భీమిలి క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేసి, మూడు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనపర్చుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారిని పరిశీలక గృహానికి(జువైనల్ హోమ్) తరలించారు. భీమిలిలో క్రైం ఏసీపీ ఎ.వెంకటరావు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. సప్తగిరి థియేటర్ ఏరియాలో నివసిస్తున్న చింతపల్లి సత్యవతి ఈనెల 9న సాయంత్రం థియేటర్ పక్కనున్న చిన్న సీసీ రోడ్డులో పూలు కోసుకుని వెళ్తుండగా నిందితుడు రాజేష్ ఆమె వెనుక వెళ్తూ రోడ్డు చివరకు చేరుకోగానే బలంగా ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడును తెంచి, అప్పటికే బైకుపై సిద్ధంగా ఉన్న ఇద్దరు మైనర్లతో కలిసి పరారయ్యాడు. వృద్ధురాలు కింద పడడంతో తలకు తీవ్ర గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో నార్త్ సబ్ డివిజన్ సీఐ బీఎస్‌ఎస్ ప్రకాష్, భీమిలి, ఆనందపురం క్రైమ్ ఎస్‌ఐలు ఆర్.శ్రీనివాసరావు, షేక్ షరీఫ్‌లు, సిబ్బంది వారం రోజులు నిందితుల కోసం గాలించారు. విజయనగరం పాతబస్టాండ్ ఏరియాలో నివసించే ప్రధాన నిందితుడు గ్రంధి రాజేష్‌ను, ఇరువురు మైనర్లను పట్టుకున్నారు. వెల్డింగ్ దుకాణం నడుపుతున్న రాజేష్ కొంతకాలంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్స్‌కు అలవాటు పడి సుమారు రూ.5 లక్షల వరకూ అప్పులపాలవ్వడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయానికి వచ్చాడు. విజయనగరం జిల్లా డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో బైక్ దొంగిలించి, దానిపైనే భోగాపురం, విశాఖపట్నం జిల్లా భీమిలి పోలీసుస్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. శనివారం నిందితులు భీమిలి-తగరపువలస రహదారిలో అనుమానాస్పదంగా బైక్‌పై సంచరిస్తుండగా పట్టుకుని అరెస్టు చేశారు. మూడు తులాల బంగారు పుస్తెలతాడు, నేరానికి వినియోగించిన హోండా షైన్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగర క్రైం డీసీపీ కె.లతామాధురి సూచనలతో ఈ కేసును పదిరోజుల్లోనే ఛేదించగలిగామన్నారు. దర్యాప్తు బృందంలో ఉన్న సీఐ ప్రకాష్, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, షరీఫ్, ఏఎస్‌ఐ జి.సత్యారావు, కానిస్టేబుళ్లు శివకుమార్, రవిబాబు, అప్పలరాజు, గౌరినాయుడు, ఖలీల్, మహిళా కానిస్టేబుల్ కల్పన, హెచ్‌సీ జీవీఎస్‌కే రెడ్డిలను నగర సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారన్నారు.