Arrangements complete for Sirimanotsavam సిరిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:08 AM
Arrangements complete for Sirimanotsavam పైడిమాంబ సిరిమానోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో జరగనున్న పైడిమాంబ పండగలో భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
సిరిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
దేవదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష
విజయనగరం కల్చరల్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి):
పైడిమాంబ సిరిమానోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో జరగనున్న పైడిమాంబ పండగలో భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, గతంతో పోల్చితే పైడిమాంబ చదురుగుడి విశాలంగా ఉందని, ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. క్యూల్లో 4 వేల మంది వుండేలా చర్యలు తీసుకున్నామని, ఎవరికీ అసౌకర్యం తలెత్తకుండా అమ్మవారి దర్శనాన్ని ప్రశాంతంగా సాఫీగా చేసుకునేందుకు వసతులు కల్పించామని వివరించారు. సిరిమాను పండగకు సంబంధించి దేవదాయశాఖ పరంగా 250 మంది సిబ్బంది పనిచేస్తున్నట్టు చెప్పారు. వీరిలో కొంత మంది ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై నియమించామన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో భక్తులందరికీ ఉచిత దర్శనాలే వుంటాయని, అందరూ క్యూ పాటించి దర్శనం చేసుకోవాలని సూచించారు. సిరిమాను సంబరం సాయంత్రం 5 గంటల్లోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సమన్వయ కమిటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. భక్తులకు నిరంతరం తాగునీటి సౌకర్యం అందుబాటులో వుంటుందని చెప్పారు. సోమ, మంగళవారాల్లో సుమారు 80 వేల మంది అమ్మవారిని దర్శించుకునే అవకాశం వుందని, సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు సుమారు 3లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం వుందని అంచనా వేసినట్టు చెప్పారు.
సిద్ధమవుతున్న లడ్డూలు
సిరిమాను పండగలో భక్తులందరికీ ప్రసాదాలు అందజేసేందుకు దేవదాయశాఖ లడ్డూలు సిద్ధం చేస్తోంది. శివాలయం వీధిలోని పైడిమాంబ కళ్యాణ మండపంలో లడ్డూ తయారు చేసే పనులు ఈ నెల 23 నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం అక్కడ ప్రత్యేకంగా దేవదాయశాఖ అధికారులను నియమించి వారి పర్యవేక్షణలో లడ్డూలను తయారు చేస్తున్నారు. 80 గ్రాముల లడ్డూ రూ.15, 150 గ్రాముల పులిహోర ప్యాకెట్ రూ.10కి విక్రయించనున్నారు.