Parammakonda పారమ్మకొండపైకి వెళ్లేందుకు డోలీలు ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:12 AM
Arrange Dolis for Access to Parammakonda మహాశివరాత్రి సందర్భంగా పారమ్మకొండ వద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే భక్తులు కొండపైకి వెళ్లేందుకు డోలీలు సిద్ధం చేయాలన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసు కోవాలన్నారు.
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
సాలూరు/పాచిపెంట, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా పారమ్మకొండ వద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే భక్తులు కొండపైకి వెళ్లేందుకు డోలీలు సిద్ధం చేయాలన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసు కోవాలన్నారు. పాచిపెంట మండలం చెరుకుపల్లి సమీపంలో ఉన్న పారమ్మకొండ వద్ద వెలసిన పారమ్మతల్లిని బుధవారం కలెక్టర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షించారు. గతంలో ఎన్నడూలేని విధంగా పారమ్మకొండ వద్ద మహాశివరాత్రి జాతరను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని, భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. క్యూలైన్లు క్రమబద్ధీకరణ, భద్రతా ఏర్పాట్లుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొండ కింద నుంచి మీద వరకు విద్యుత్ దీపాలతో పాటు సంప్రదాయబద్ధమైన కాగడాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాదంతోపాటు బాలింతలు, పిల్లలకు పాలు అందించాలని సూచించారు. కొండ ఎక్కేటప్పుడు భక్తులు నెట్టుకోకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. కొండదిగువన టెంపుల్ స్టాల్ ఒకటి ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ, అమ్మవారి పుస్తకాలు, చిత్రపటాలను అతి తక్కువ ధరలకు విక్ర యించాలని తెలిపారు. శానిటేషన్, పన్నులు, పార్కింగ్ ఫీజు వసూలు బాధ్యత పంచాయతీరాజ్ శాఖాధికారులదేనని స్పష్టం చేశారు. పారమ్మకొండ వద్ద అభివృద్ధి పనులు చేపట్టి.. భక్తుల సంఖ్యను పెంచాలన్నారు. హుండీల సంఖ్య పెంచాలని.. కొండ వద్ద సేవచేసే వాలంటీర్లను లిస్టౌట్ చేయాలని సూచించారు. కొండ కింద , పైన, పాండవుల గృహ వద్ద, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు దేవదాయ శాఖ అధికారుల వద్ద ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
హరికథ చెబుతున్నానా?
పాచిపెంట తహసీల్దార్ రవికుమార్, ఎండోమెంట్ అధికారి రమేష్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారమ్మకొండ వద్ద ఏర్పాట్లపై సలహాలు, సూచనలు ఇస్తున్న సమయంలో వారు నోట్ చేసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ‘నేనేమైనా హరికథ చెబుతున్నానా?’ అంటూ కలెక్టర్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ, సాలూరు తహసీల్దార్ నీలకంఠరావు, సీఐ రామకృష్ణ, ఎంపీడీవో పార్వతి, పారమ్మ కొండ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.