Share News

Arnab’s Loss ‘ఆర్నాబ్‌’ నష్టం రూ.76 కోట్లు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:24 AM

Arnab’s Loss: ₹76 Crore ఆర్నాబ్‌ తుఫాన్‌ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. కుండపోత వర్షాల కారణంగా పలు పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. చాలాచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలవాలాయి. రోడ్లు, ఇళ్లు, నీటి వనరులు కూడా దెబ్బతిన్నాయి.

Arnab’s Loss  ‘ఆర్నాబ్‌’ నష్టం  రూ.76 కోట్లు
తుపాను కారణంగా కూలిన విద్యుత్‌ స్తంభాలు (ఫైల్‌)

  • భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇళ్లు

  • నేలవాలిన విద్యుత్‌ స్తంభాలు

  • అస్తవ్యస్తమైన రోడ్లు, నీటి వనరులు

  • ప్రభుత్వానికి నివేదికలు పంపించిన జిల్లా యంత్రాంగం

పార్వతీపురం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఆర్నాబ్‌ తుఫాన్‌ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. కుండపోత వర్షాల కారణంగా పలు పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. చాలాచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలవాలాయి. రోడ్లు, ఇళ్లు, నీటి వనరులు కూడా దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించిన జిల్లా యంత్రాంగం.. తుఫాన్‌ నష్టం రూ.76 కోట్లుగా తేల్చింది. ఈ నివేదికలను ప్రభుత్వానికి పంపించింది.

ఇదీ పరిస్థితి..

- తుఫాన్‌ ప్రభావానికి జిల్లాలో రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో ఆర్‌అండ్‌బీ శాఖకు సుమారు రూ.54 కోట్ల పైబడి నష్టం ఏర్పడింది. దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలంటే రూ.నాలుగు కోట్లు అవసరం. అదేవిధంగా రహదారులు నిర్మించాలంటే రూ.50 కోట్ల వరకు అవసరమని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

- భారీ వర్షాలకు 98 ఇళ్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల రూ.ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు గుర్తించారు.

- వరదల కారణంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని కొన్ని రహదారులు అధ్వానంగా మారాయి. వంతెనలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో రూ.45 లక్షల వరకు నష్టం ఏర్పడినట్లు ఆ శాఖాధికారులు తేల్చారు.

- జిల్లాలో మైనర్‌ ప్రాజెక్టులకు రూ.5.38 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుర్తించారు. అదే విధంగా ఇతర నీటి వనరులకు సంబంధించి సుమారు రూ.ఐదు కోట్ల పైబడి నష్టం ఏర్పడినట్టు ఇరిగేషన్‌ శాఖాధికారులు అంచనా వేశారు.

- మత్స్యకారుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో చాలాచోట్ల చేపల పెంపకం చేపడుతున్నారు. అయితే వర్షాలకు చెరువులకు గండిపడడంతో మత్స్య సంపద కొట్టుకుపోయింది. దీంతో సుమారు రూ.8 లక్షల వరకు నష్టం వాటిలినట్లు ఆ శాఖాధికారులు గుర్తించారు.

- జిల్లాలో ఏపీఈపీడీసీఎల్‌కు సుమారు రూ.42 కోట్ల మేర నష్టం ఏర్పడింది. 11, 33 కేవీ ఫీడర్స్‌ దెబ్బతిన్నాయి. 11 కేవీ విద్యుత్‌ స్తంభాలు 78, ఎల్‌టీ పోల్స్‌ 80 వరకు నేలవాలాయి.

- జిల్లాలో 1006 హెక్టార్లలో వరి, తదితర పంటలతో పాటు 198 ఎకరాల్లో అరటి పంటకు నష్టం ఏర్పడినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి.

Updated Date - Oct 08 , 2026 | 12:24 AM