Arnab’s havoc in the district జిల్లాలో ఆర్నబ్ విలయం
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:14 AM
Arnab’s havoc in the districtఆర్నబ్ తుఫాన్ జిల్లాను అస్తవ్యస్తంగా మార్చింది. ఈదురుగాలులకు తోడు కుండపోతగా వర్షం కురవడంతో రెండు రోజుల పాటు సగటున 30 సెంటీమీటర్లకుపైగా వర్షం నమోదైంది. ఎటుచూసినా జలమే కనిపించింది. గురువారం పెద్దగా వాన లేకపోయినా తుఫాన్ మిగిల్చిన కష్టం నుంచి పూర్తిగా తేరుకోలేదు.
జిల్లాలో ఆర్నబ్ విలయం
రికార్డు స్థాయిలో వర్షాలు
30 సెంటీమీటర్లకుపైగా వానలతో వణుకు
వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం
211 కిలోమీటర్లకుపైగా దెబ్బతిన్న రోడ్లు
విద్యుత్ శాఖకు సైతం పెద్ద దెబ్బ
విజయనగరం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి)
ఆర్నబ్ తుఫాన్ జిల్లాను అస్తవ్యస్తంగా మార్చింది. ఈదురుగాలులకు తోడు కుండపోతగా వర్షం కురవడంతో రెండు రోజుల పాటు సగటున 30 సెంటీమీటర్లకుపైగా వర్షం నమోదైంది. ఎటుచూసినా జలమే కనిపించింది. గురువారం పెద్దగా వాన లేకపోయినా తుఫాన్ మిగిల్చిన కష్టం నుంచి పూర్తిగా తేరుకోలేదు. ప్రధానంగా వరికి నష్టం వచ్చేలా ఉంది. ముఖ్యంగా నాగావళి, సువర్ణముఖి, వేగావతి, చంపావతి నదులు పొంగి ప్రవహించాయి. వీటికి అనుబంధంగా ఉన్న కాలువలు సైతం అదేస్థాయిలో ప్రవహించడంతో ఎక్కడికక్కడే కల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి. చెరువులతో పాటు కాలవులకు గండ్లు పడ్డాయి. అటు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎప్పటికప్పుడు విద్యుత్ సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. అయినప్పటికీ గురువారం నాటికి కేవలం పట్టణాలకు మాత్రమే పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలిగారు.
ఈసారి తుఫాన్‌తో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎక్కడికక్కడే రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో అవి దెబ్బతిన్నాయి. ఇటీవల వేసిన రోడ్లు కొట్టుకుపోయాయి. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులు అంచనాలు వేసే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 211 కిలోమీటర్లకుపైగా రోడ్లు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఒక్క రహదారుల నష్టమే రూ.62 కోట్లకుపైగా ఉందని...తక్షణ మరమ్మతులకు రూ.9.4 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు.
- జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖకు సంబంధించి 299 స్తంభాలు నేలకొరిగాయి. 51 ట్రాన్స్పార్మర్లు దెబ్బతిన్నాయి. వైర్లకు అడ్డంకిగా మారిన 525 చెట్లను తొలిగించారు. దాదాపు రూ.45 లక్షల వరకూ నష్టం ఉంటుందని అంచనా. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్టు ఎస్ఈ లక్ష్మణరావు తెలిపారు. వర్షంలో విధులు నిర్వహిస్తూ వేపాడ మండలం నల్లబల్లి గ్రామంలో జూనియర్ లైన్‌మేన్ దువ్వాడ పైడిరాజు విద్యుదాఘాతంతో మృతిచెందారు.
- రైతాంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లా వ్యాప్తంగా రికార్డుస్థాయిలో వర్షం నమోదైంది. వేలాది ఎకరాలు ముంపుబారిన పడ్డాయి. రాజాం, చీపురుపల్లి, ఎస్.కోట, బొబ్బిలి నియోజకవర్గాల్లో నష్టం అధికంగా ఉంది. నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదుల పరివాహక ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. జిల్లా వ్యాప్తంగా 3143 హెక్టార్లలో వరి, 8 హెక్టార్లలో మొక్కజొన్న, 24 హెక్టార్లలో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు పూర్తిస్థాయి నష్టం గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు. మొక్కజొన్న, అరటి, పత్తి వంటి పంటలు సైతం చేతికందే సమయంలో దెబ్బతిన్నాయి. వాణిజ్య, అపరాలు 2 వేల ఎకరాల్లో నష్టం జరిగిందన్నది అధికారుల ప్రాథమిక అంచనా.
ఇప్పటికీ భోగాపురం మండలం రావాడ వద్ద రోడ్డుపై రాకపోకలు సాగడం లేదు. విజయనగరం మండలం సారిక గ్రామం వద్ద తిమ్మరాజు చెరువు గండికొట్టడంతో అనేక ఎకరాల్లో వరి నీట మునిగింది. సారిక - జొన్నవలస రహదారిపై కూడా గురువారం సాయంత్రానికి రాకపోకలు సాగలేదు.
మడ్డువలస రిజర్వాయర్‌కు తగ్గని వరద
వంగర , అక్టోబరు29 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావంతో రిజర్వాయర్‌కు వరద నీరు భారీగా వచ్చిచేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వేగావతి, సువర్ణముఖి నదుల ద్వారా ఉధృత ప్రవాహం రావడంతో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సమీక్షించిన అధికారులు ముందస్తుగా రిజర్వాయర్ 8 ప్రధాన గేట్లు ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. వరద కారణంగా కొప్పర , కొండచాకరాపల్లి , గీతనాపల్లి , కోనంగిపాడు గ్రామాల రహదారులు, ప్రధాన వీధులు, నివాసగృహల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు.